Merugu Nagarjuna: రాజకీయాల్లో వచ్చాక ఎన్ని పార్టీలు ఉన్నాయో.. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదే అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు మంత్రి మేరుగు నాగార్జున.. ఎలాంటి నీచ రాజకీయాలకైనా పాల్పడే వ్యక్తి చంద్రబాబు అని.. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లో వచ్చాక ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్నీ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనత ఆయనదే అని.. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2014లో బీజేపీ-చంద్రబాబు-పవన్ కల్యాణ్ .. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారన్న ఆయన.. ఇప్పుడు కలిసి పోటీ చేయాలని పరితపిస్తున్న చంద్రబాబు మమ్మల్ని ఏం చేయగలడు..? అని ప్రశ్నించారు.
Read Also: Viral Video : అరె ఏంట్రా.. నీ డ్రైవింగ్ కు దండం రా..
ఇక, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తిట్టిన పవన్ కల్యాణ్.. అధికారం లేనప్పుడు ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించారు నాగార్జున.. చంద్రబాబు పొత్తు కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాళ్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అని నిలదీశారు. రాజకీయాల కోసం ఏ గడ్డైనా తినే వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. ఇన్ని పార్టీలు కలిసినా ఇప్పటికీ 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల్లో ఎస్సీ నాయకుల్ని మారుస్తున్నామని చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. చంద్రగిరిలో పుట్టిన నువ్వు కుప్పంలో పోటీ చేయటం లేదా..? నీ కొడుకు ఎక్కడ పుట్టాడు.. మంగళగిరిలో పోటీ చేయడం లేదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి మేరుగు నాగార్జున.