వరంగల్ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలొస్తే సంక్రాంతి గంగిరెద్దుల్లా బీజేపీ, కాంగ్రెస్ నేతలు వస్తారంటూ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ చిల్లర గాల్లతో కలిసి టెన్త్ పరీక్షపత్రం లీక్ చేయాలని చూసాడని, లక్షల మంది పిల్లల తల్లి తండ్రులను అయోమయానికి గురి చేశాడన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి లోపల వేసిర్రు.. బెయిల్ పై బయటకు వస్తే సన్మానాలు చేసుకున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. ‘బండి సంజయ్ ను జైల్లో వేయగానే, పేపర్ లీకులు ఆగినయ్. నెత్తురు కారిన తెలంగాణలో ఇప్పుడు సాగు నీరు, త్రాగు నీరు వస్తున్నాయ్. మతం, కులం పేరుతో కొట్టుకుచావాలని కుట్రలు చేస్తున్నారు. పచ్చని పంటల తెలంగాణ కావాలో, మత చిచ్చు మంటల తెలంగాణ కావాలో తేల్చుకోండి. దేశానికే ఆదర్శంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరంగల్ లో నిర్మిస్తున్నాం. 2014లో పార్లమెంట్ లో విభజన చట్టంలో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు. ఇప్పుడు అడిగితే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదంటున్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ రాకుండా అడ్డుకుంటున్నారు. వరంగల్ నగరంలో మంచినీళ్ల కోసం 645 కోట్లు ఖర్చు చేశాం.
Also Read : Dwaraka Tirumala Kalyanam: అంగరంగవైభవంగా ద్వారకా తిరుమలేశుడి కల్యాణం
1116 కోట్లతో హెల్త్ సిటీ నిర్మిస్తున్నాం. 148 కోట్లు వరంగల్, హనుమకొండ నూతన కలెక్టరేట్ లకు కేటాయించాం. 85 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నాం. 163 హైవే పై 78 కోట్ల తో అర్ఓబీ నిర్మించాం. 70 కోట్ల నిధులతో నాళాలు నిర్మించాం. 75 కోట్లతో రెండు బస్ స్టాండ్ లు నిర్మిస్తాం. 50 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేటాయించాం. 28 కోట్లతో 22 పార్కులు నిర్మించాం. 32 కోట్లు భద్రకాళీ ఆలయంలో మాడ వీధులకు, 20 కోట్లు మినీ స్టేడియం నిర్మాణానికి, 6 కోట్లు కమ్యూనిటీ భవనాలకు, 10.50 కోట్లు వైకుంఠదామాల నిర్మాణానికి, 3 కోట్లు దోబీ ఘాట్ల నిర్మాణానికి కేటాయించాము. బీఆర్ఎస్ ఇన్ని చేస్తే వరంగల్ కి బీజేపీ ఏం చేసింది. కేంద్రం తెలంగాణపై కక్షతో అబివృద్దికి అడ్డుపడుతోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. వరంగల్ కు సాప్ట్ వేర్ కంపెనీలు వచ్చాయి. కోవిడ్ కారణంగా కొన్ని పనులు మందగించాయి. కొత్త ఐటీ కంపెనీలు వరంగల్ కు తీసుకొస్తాం. 12వేల మందికి ఇండ్ల పట్టాలు ఇస్తాం. అన్ని రాష్ట్రాలకు సీఎం లు ఉన్నారు కానీ తెలంగాణలో రాష్ట్రం తెచ్చిన సీఎం ఉన్నాడు. తెలంగాణకు మనిహరంగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతాం. మీ కోసం పనిచేసే పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Minister KTR : 9 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నాం