NTV Telugu Site icon

Deeksha Divas: తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌.. ఎన్నికల స్క్వాడ్‌ అభ్యంతరం!

Minister Ktr Brs

Minister Ktr Brs

KTR participate in Deeksha Divas: హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘దీక్షా దివస్‌’పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఈసీ అభ్యంతరం తెలిపింది. పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని ఈసీ అధికారులు అనగా.. దీక్షా దివస్‌ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. ఆపై తెలంగాణ భవన్‌కు మంత్రి కేటీఆర్‌ చేరుకున్నారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభించి.. రక్తదానం చేశారు. అనంతరం దీక్షా దివస్‌పై మాట్లాడారు. ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ అన్నారు. 2009లో సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేశారు.

Also Read: Telangana Assembly Elections 2023: రేపే పోలింగ్‌.. ప్రలోభాల జాతర పీక్స్‌కి..!

తెలంగాణ మలి దశ ఉద్యమానికి బీజం పడిన రోజు 2009 నవంబర్‌ 29. తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో…’ అని నినదిస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఢిల్లీ పీఠం దిగొచ్చేందుకు నాంది పలికారు. సరిగ్గా నేటితో తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ నిరాహార దీక్షకు దిగి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దీక్షా దివస్‌ కార్యక్రమం చేపట్టారు.