NTV Telugu Site icon

Steel Flyover: అందుబాటులోకి రానున్న స్టీల్ ఫ్లైఓవర్‌.. నాయిని పేరు పెట్టిన ప్రభుత్వం

Steel Flyover

Steel Flyover

Steel Flyover: హైదరాబాద్ ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరబోతోంది. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఈ నెల 19వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వంతెన ప్రారంభం కానున్నది. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని SRDPలో భాగంగా GHMC చేపట్టింది. దీనికైన ఖర్చు 450 కోట్లు. ఈ స్టీల్‌ బ్రిడ్జికి దివంగత బీఆర్‌ఎస్ నేత, మాజీ హోంమత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టారు. ముషీరాబాద్‌లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి, వీఎస్టీ కార్మిక సంఘం నాయకుడిగా నాయిని చేసిన సేవలను స్మరించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రిడ్జి విశేషాలకు వస్తే.. దక్షిణ భారత దేశంలోనే రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కు వంతెన ఇదే. జీహెచ్‌ఎంసీ చరిత్రలో కూడా భూసేకరణ లేకుండా నిర్మించిన బ్రిడ్జి ఇది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. హైదరాబాద్‌లో మెట్రో పైనుంచి వెళ్లిన వంతెన కూడా ఇదే మొదటిది. నాలుగు లేన్లతో సాగే ఈ వంతెన పొడవు 2.62 కిలోమీటర్లు. దీనికోసం 12 వేల 316 మెట్రికల్ టన్నుల ఉక్కుని వాడారు. మొత్తం 81 పిల్లర్లు.. 426 ఉక్కు దూలాలతో నిర్మించారు. కాంక్రీటుతో పోలిస్తే ఇది వందేళ్లకు పైగా మన్నుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

ఇక, ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రూట్‌లో జనావాసాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, హాస్టల్స్‌, కాలేజీలు ఎక్కువ ఉన్న విషయం విదితమే.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో వాహనదారుల కష్టాలు తొలగిపోనున్నాయి.. మరోవైపు.. వంతెన ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.. ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌, అశోక్‌నగర్‌, వీఎస్టీ జంక్షన్‌లో దశాబ్దాల తరబడిగా ఉన్న ట్రాఫిక్‌ రద్దీ సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.. తెలంగాణ తొలి హోంమంత్రిగా పని చేసిన స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి పేరును పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని కూడా తన ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్‌.

Show comments