మంత్రి కేటీఆర్ గొప్ప మానవత్వం చాటుకున్నారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదివారం జగిత్యాల జిల్లాలో జరిగిన సభను ముగించుకుని సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో చేగుంట మండలం జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి ఇబ్బంది పడుతున్న బాధితులను చూసి మంత్రి కారు దిగి వారిని పరామర్శించారు. అనంతరం తన కాన్వాయిలో ఉన్న మరో వాహనంలో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మంత్రి చూపిన ఔదార్యంతో స్థానికులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఆపదలో స్పందించిన తీరు అందరి ప్రశంసలు పొందుతుంది.
ఇదిలా ఉంటే.. ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ తండ్రి సంస్మరణ సభలో పాల్గొనేందుకు జగిత్యాలకు వచ్చిన మంత్రి కేటీఆర్ అనంతరం స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇపుడున్న కాంగ్రెస్ చంద్రబాబు కాంగ్రెస్ అని, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముమ్మాటికీ ఆర్ఎస్ఎస్ ఎజెంట్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పూర్వం అంతా ఏబీవీపీ,ఆర్ఎస్ఎస్ లో పనిచేసి ఇప్పుడు గాంధీ భవన్ లో గాడ్సేలా దూరాడని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు, కరెంట్ ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండ ,ప్రాజెక్టులు కట్టకుండా వ్యవసాయాన్ని అధోగతి పట్టించిన కాంగ్రెస్ కేసీఆర్ పాలనతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో మరోసారి కరెంట్ విషయంలో విష ప్రచారం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నడని మండి పడ్డారు.
