Site icon NTV Telugu

Minister Konda Surekha: రాజన్న కోడెల వివాదంపై స్పందించిన మంత్రి సురేఖ

Konda Surekha

Konda Surekha

Minister Konda Surekha: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా కొండా సురేఖ తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను మంత్రి సురేఖ ఖండించారు.గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల సంఖ్య పెరుగుతుండటంతో కోడెల నిర్వహణ భారంగా మారి చాలా కోడెలు మరణించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల విన్నపాల మేరకు మొక్కుల రూపంలో భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలను రూపొందించేందుకు ఆరు నెలల క్రితం మేలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు ఇతర సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలను రూపొందించినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు.

ఈ మార్గదర్శకాల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, సంబంధిత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం ఉంటేనే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. ధ్రువీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా వుంటేనే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున మాత్రమే ఇస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలలో సీసీ ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేఖ వివరించారు. మూగజీవాలపై తమ ప్రభుత్వానికున్న శ్రద్ధ అటువంటిది అని మంత్రి అన్నారు. ఎంతో నిబద్ధతతో గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణను చేపడుతున్న పరిస్థితుల్లో కోడెలను అక్రమంగా విక్రయించారని వచ్చిన వార్తలు వట్టి పుకార్లను మంత్రి సురేఖ కొట్టి పారేశారు.

Read Also: Telangana: ప్రజాపాలనా విజయోత్సవాలకు గవర్నర్, కేసీఆర్‌, కిషన్ రెడ్డికి ఆహ్వానం

సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించమని సంబంధింత అధికారులకు సూచిస్తుంటామని, కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను అదే విధంగా పంపించామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. దేవస్థానం అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను పంపిణీ చేసారని మంత్రి పునరుద్ఘాటించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలోని ప్రతి కోడెకు శాశ్వతమైన ట్యాగ్ వుంటుందని, అటువంటి ట్యాగులున్న కోడెలు ఎక్కడా పట్టుబడలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిజానిజాలను వెల్లడిస్తూ నిన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఈవో స్పష్టతనిచ్చిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని అవాస్తవ ప్రచారం చేస్తూ, సమాజంలో అశాంతిని సృష్టించే అసాంఘిక శక్తులను వెలికితీసి, చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Exit mobile version