Site icon NTV Telugu

AP Cabinet Decisions: అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం.. క్యూఆర్‌ కోడ్‌తో పాసు పుస్తకాలు.. కేబినెట్‌ నిర్ణయాలివే..

Cabinet

Cabinet

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం చేసేలా గత ప్రభుత్వం జీవో జారీలు చేసిందని.. గ్రామాల్లో చెరువులను.. కుంటలను బహిరంగ వేలం వేయాలని అప్పటి సర్కారు నిర్ణయించిందని.. మత్స్యకారుల సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచడం, మత్స్య సంపద పెంచే అంశంపై అధ్యయనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

Read Also: Minister Satya Prasad: మదనపల్లె ఫైళ్ల దహనం ఘటనలో కుట్ర కోణం.. సీఐడీ విచారణలో తేలుస్తాం!

ఏపీలో జనాభా సంఖ్యా రోజు రోజుకూ తగ్గుతోందని.. జాతీయ సగటుతో పోల్చినా ఏపీలో జనాభా సంఖ్య తక్కువగానే ఉందని.. యువత తగ్గిపోతోందన్న సర్వేలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇద్దరి పిల్లలకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయకూడదని స్థానిక సంస్థల్లో నిబంధన ఉందని.. ఇలాంటి నిబంధనలను రద్దు చేస్తూ బిల్లుకు ఆమోదం తెలిపామని వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరుగదల అవసరమన్నారు. పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కేబినెట్ భావిస్తోందన్నారు. కొత్త వైద్య కళాశాలల్లో అదనంగా 380 పోస్టులకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. సున్నిపెంట పంచాయతీకి ఇచ్చిన 208.74 ఎకరాల భూమిని రద్దు చేశామన్నారు. ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని.. శ్రీశైలం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కోసం వినియోగించుకుంటామన్నారు.

Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆ బిల్లుకు ఆమోదం

ఎక్సైజ్ శాఖపై చర్చించామన్న మంత్రి పార్థసారధి.. ఎక్సైజ్ శాఖను ఏకీకృత పర్యవేక్షణకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మెరుగైన ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తామన్నారు. గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని.. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్టులోకి తెస్తామని చెప్పారు. అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి వస్తుందని.. మద్యం ధరలు తగ్గిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ మద్యం విధానాల వల్ల రూ. 18 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకు గత ప్రభుత్వం గుత్తాధిపత్యం ఉండేలా విధానాన్ని రూపొందించిందని మంత్రి వర్గం అభిప్రాయపడిందన్నారు. 22-ఏ ఫ్రీ హోల్డ్ చేసి గత ప్రభుత్వం దోపిడీ చేసిందని మంత్రి విమర్శించారు.

భూ సమస్యల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వివాదంలో ఉన్న రిజిస్ట్రేషన్ల పునః పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 25 వేల ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేశారని.. మూడు నెలల పాటు అసైన్డ్, 22-ఏ రిజిస్ట్రేషన్లు విచారణ చేపడతామని మంత్రి వెల్లడించారు. మూడు నెలల పాటు విచారణ పూర్తయ్యేంత వరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తామని ప్రకటించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. సర్వే రాళ్లపై వేసిన జగన్ బొమ్మలను చెరిపేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

 

Exit mobile version