Minister Kandula Durgesh: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును రైల్వే అధికారులను, రహదారులు భవనాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించామన్నారు. ఆర్ఓబి నిర్మాణం జరిగే చోట ప్రధాన కాలువ ఉండడం, ఆ కాలువ ద్వారా సాగునీరు వస్తుండడం వల్ల ఆర్‌వోబీ పనులకు కొంత ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. ఆర్ అండ్ బీ అధికారులు, రైల్వే అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, రైతులు కలిసి సమన్వయంతో పనులు సక్రమంగా జరిగేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఆర్ఓబీని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Amaravati: రాజధాని పనుల పున:ప్రారంభంపై సీఎం చంద్రబాబు ట్వీట్
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నిడదవోలులో ఆర్ఓబీ పనుల పరిశీలన చేసిన మంత్రి రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఒక భవంతి వద్ద తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాతగారు హోమియో వైద్యులుగా సేవలందిస్తూ నివసించిన పాత భవనం వద్ద నిలబడి ఆనందం వ్యక్తం చేశారు. ఆ భవంతిని చూపిస్తూ మధుర జ్ఞాపకాలను వివరించారు. అదే దారిలో రిక్షా బండిపై కంచెం పెట్టుకొని అన్నం తింటున్న వృద్ధురాలిని పలకరించారు. కుటుంబం బాగోగుల గురించి ఆరా తీశారు. పెన్షన్ వస్తుందా లేదా అంటూ ప్రశ్నించారు. 4000 రూపాయలు అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీశారు. మంత్రి వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.