ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందడం, టైం బాగాలేకపోతే శవాలుగా మారడం మామూలే. అయితే రోగులు చనిపోయాక వారికి జరగాల్సిన కార్యక్రమాలు సరిగా జరగడంలేదు. పోస్టుమార్టం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు మృతుల బంధువులు. పోస్టుమార్టం కోసం కట్టిన భవనం ఇంకా ప్రారంభం కాలేదు. ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం భవనాన్ని ఆధునికీకరిస్తాం… ఎంతఖర్చైనా పర్వాలేదు అన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అన్న మాటలు ఇంకా మూటలుగానే మిగిలిపోయాయి. కానీ ఇంకా వేసిన తాళం తీయనేలేదు. ఏడునెలలుగా శవపరీక్ష గది ప్రారంభానికి నోచుకోకుండా ఎదురు చూపులు చూస్తుంది.
Read Also: Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!
గత ఏప్రిల్ నెలలో జిల్లాకు వచ్చిన మంత్రి హరీష్ రావు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.30లక్షలతో నిర్మించిన శవపరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. ప్రారంభించిన రోజు నుంచీ ఆరంభ శూరత్వమే అన్నట్లు నేటి వరకు ఆ కేంద్రం తలుపులు తెరుచుకోలేదు. జిల్లా ఆస్పత్రిలో ప్రతి నిత్యం కనీసం మూడు నుంచి 5 పోస్టుమార్టంలు నిర్వహిస్తున్నారు వైద్యులు. మృతదేహాలను నేలపైనే ఉంచడం.. వాటికి సముచిత గౌరవాన్ని ఇవ్వక పోవడం పట్ల మృతుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఆధునిక సదుపాయాలను కల్పిస్తామన్న మంత్రుల మాటలు మాత్రం నీటి మూటలయ్యాయి… అధికారులు ఇప్పటికైనా ఈ శవపరీక్ష కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also: Medaram Rush: మేడారంలో భక్తుల సందడి.. మినీజాతరకు ముందే రద్దీ