Minister Gummanur Jayaram: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు, చేర్పులు.. కొన్ని ప్రాంతాల్లో వివాదాలకు దారి తీశాయి.. పోటీ చేసే స్థానాలు మారిపోవడంతో.. తాజా అభ్యర్థులకు సరైన సహకారం ఉన్నట్టుగా కనిపించడంలేదు.. మరికొన్ని చోట్ల మాత్రం కొత్త ఉత్సాహంతో నేతలు దూసుకుపోతున్నారు. అయితే, ఇదే సమయంలో.. వైసీపీ సీనియర్ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా.. ఆయన అందుబాటులోకి రావడం లేదట.. అసలు మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం ఏమై ఉంటుంది? ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వొచ్చు కదా? అంటున్నారట వైసీపీ పెద్దలు.
అయితే, ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం.. ఆయన్ని కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామం జరిగిన తర్వాత 4 రోజులు బెంగుళూరులో ఉన్న జయరాం.. ఆ తర్వాత ఆలూరులో మూడు రోజులు గడిపారు. ఇదే సమయంలో ఆలూరు వైసీపీ తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదట. ఇక, నిన్న ఆలూరు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట మంత్రి జయరాం.. ఎంపీగా పోటీ చేసే విషయంపై మాట్లాడేందుకు వైసీపీ ముఖ్య నేతల ప్రయత్నం చేసినా ఆయన దొరకడం లేదట.. అయితే, ఆలూరు స్థానాన్ని వదులుకోవడానికి మంత్రి జయరాం సుముఖంగా లేరని ఆయన అనుచరులు చెబుతున్నమాట.. ఇదే సమయంలో.. ఎమ్మెల్యే స్థానం నుంచి కాకుండా.. ఈ సారి ఎంపీగా పోటీ చేసేందుకు కూడా ఆయనకు ఇష్టం లేదనే ప్రచారం సాగుతోంది.. అందుకే ఆయన ఎవరీకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ సాగుతోంది.
కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా విడుదల చేసిన మూడో జాబితాలో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.. అయితే, ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జయరాం అంటున్నారు. తనకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట.. ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ సాగుతోంది.. మరి, మంత్రి గుమ్మనూరు జయరాం మనసులో ఏముంది.. లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగుతారా? అనే విషయం వేచిచూడాలి.