Site icon NTV Telugu

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు చేయూత పథకం నాలుగో విడత చెల్లింపులు జరుపుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. 6100 పోస్టులతో మెగా డీఎస్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని.. వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఆయన వెల్లడించారు. నిరుద్యోగులకు ఈ కేబినెట్ శుభవార్త అందిస్తుందన్నారు. ఇక టీచర్ పోస్టులేవీ ఖాళీ లేవని.. ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషనుతో ఖాళీలన్నీ భర్తీ అయిపోతాయన్నారు.

Read Also: Covid-19 Cases : దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు .. ఆ రాష్ట్రాలకు అలెర్ట్..

ఇప్పటి వరకు 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చామన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. విద్యా విధానంలో ఐబీ సిలబస్ ఎంటర్ చేశామన్నారు. యూనివర్శిటీల్లోని బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం డీఎస్సీ పై కసరత్తు చేస్తోంది. ఆరు వేలకు పైగా పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు చేపడుతోంది. ఇవాళ సాయంత్రం డీఎస్సీ నోటిఫికేషన్, విధి విధానాల పై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం కానున్నారు.

ఇదిలా ఉండగా..  బీసీ కులగణనను తప్పు పట్టిన పవన్ తీరుపై మంత్రి చెల్లుబోయిన  మండిపడ్డారు. బీసీ కులగణనను ప్రశ్నించడమేంటని.. చంద్రబాబు అనలేక పవన్‌తో ప్రశ్నలు వేయించారని తీవ్రంగా మండిపడ్డారు.  ప్రజలకు.. పేదలకు మంచి జరుగుతోంటే పవన్ తప్పు పడతారా అంటూ ప్రశ్నించారు. ఎవరెన్ని బాణాలేసినా.. బండలేసినా జగనుకు హారాలే అవుతాయన్నారు. ఇప్పుడు 175 మాలలు జగన్ మెడలో వేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.

కేబినెట్‌లో పలు కీలక అంశాలకు ఆమోదం
*మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్.. 6100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం.
*వైఎస్సార్ చేయూత 4వ విడతకు ఆమోదం.. ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల.
*ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం.. ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం
*ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం.. ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదం
*యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు
*అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
*నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం
*రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
*ఆజేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

 

Exit mobile version