NTV Telugu Site icon

Minister AppalaRaju: తిరుమలలో అనుచరులతో మంత్రి హల్ చల్

Appala 1

Appala 1

ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నిత్యం వార్తల్లో వుంటుంటారు. గతంలో అనేకసార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు మంత్రి అప్పలరాజు. తాజాగా మంత్రి అప్పలరాజు కలియుగ వైకుంఠం తిరుమలలో హల్ చల్ చేశారు. భారీగా అనుచరులతో తిరుమల చేరుకున్నారు మంత్రి అప్పలరాజు. తన అనుచరులందరికి ప్రోటోకాల్ దర్శనం కల్పించాలటూ టీటీడీ అధికారులపై వత్తిడి తెచ్చారు. అసలే మంత్రి.. ఆయన వత్తిడికి టీటీడీ తలొగ్గాల్పిందే మరి. అప్పలరాజు ఒత్తిడితో టీటీడీ అధికారులు తలవంచకతప్పలేదు. నిబంధనలు ప్రక్కన పెట్టి 140 మంది అనుచర వర్గానికి ప్రోటోకాల్ దర్శన కల్పించింది టీటీడీ. నిబంధనల ఉల్లంఘనపై సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మంత్రివర్గంలో రెండవసారి మంత్రి పదవి పొందారు సీదిరి అప్పలరాజు.

గతంలోనూ జగన్ పర్యటనలో శారదా పీఠం దగ్గర పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో శారదాపీఠంలో సీఎం జగన్ పర్యటించారు. జగన్ విశాఖ పర్యటన సందర్బంగా పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శారదాపీఠం ద్వారం వద్ద పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి తన అనుచరులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరయ్యారు. అప్పటికి ఇంకా సీఎం జగన్‌ రాలేదు. మంత్రి అప్పలరాజు పీఠం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లేటప్పుడు ఆయనతో పాటు ఉన్న పలాస పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ పూర్ణచంద్రరావు, ఆయన అనుచరులను సీఐ రాజుల్‌ నాయుడు అడ్డుకున్నారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

సీఐపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేయి వేసి ముందుకు తోశారు. అక్కడ కొద్దిపాటు వివాదం చెలరేగింది. అనంతరం ఆ సీఐని వీఆర్‌ కి పంపారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కొన్ని నిబంధనలు పాటిస్తారని, ఎక్కువమంది అనుచరులతో వచ్చిన మంత్రిని సీఐ అడ్డుకున్నారని పోలీసులు అన్నారు. ఈ విషయంలో మంత్రిని క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారులే కోరారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని మంత్రి సీదిరి అప్పలరాజు పరుష పదజాలంతో దుర్భాషలాడి.. దౌర్జన్యం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం ఖండించింది.

అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. తాజాగా మంత్రి అంతమంది అనుచరులతో తిరుమలకు రావడం, వారికి ప్రోటోకాల్ దర్శనం కోసం పట్టుబట్టి టీటీడీపై వత్తిడి తేవడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. దీనిపై టీటీడీ అధికారులేమంటారో చూడాలి. తిరుమలకు నిత్యం 70 నుంచి 80 వేలమంది భక్తులు వస్తుంటారు. రాజకీయ వత్తిడుల వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడతారనే వాదన వినిపిస్తోంది.

Gold Rates Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. హైదరాబాద్‌లో ఎంతంటే..?