NTV Telugu Site icon

Minister Adimulapu Suresh: నన్ను తగులబెట్టినా భయపడను.. మేం దాడి చేయలేదు.. ప్రమాణానికి సిద్ధం..!

Minister Adimulapu Suresh

Minister Adimulapu Suresh

Minister Adimulapu Suresh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారం ఒకరిపై ఒకరు.. అన్నట్టుగా టీడీపీ, వైసీపీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. చంద్రబాబు పర్యటన సందర్భంలో దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలని శాంతియుతంగా నిరసన తెలిపామన్న ఆయన.. మేం దాడి చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధం.. టీడీపీ నేతలు వస్తే కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేద్దాం అన్నారు.. నిరసన ప్రాంతానికి చేరుకున్న సమయంలో దళిత నేతలను చంద్రబాబు వేలు చూపించి బెదిరించారు.. అల్లరి మూకలను మా మీదకు ఉసిగొల్పారు.. ఈ ప్రదేశంలో ఆపి రెచ్చగొట్టారు.. కారంచేడు, చుండూరు లాంటి మరో మారణహోమం సృష్టించాలనుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

దళితుల పట్ల చంద్రబాబులో మార్పు రాదు.. ప్రీ ప్లాన్ స్క్రిప్ట్ ప్రకారమే అల్లరి మూకలను తీసుకువచ్చారని మండిపడ్డారు మంత్రి సురేష్‌.. రాళ్ళు, జెండాలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.. వైసీపీ కార్యకర్తలకు రక్త గాయాలయ్యాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ దళితులు ఏం పీకుతారు అని అసభ్య పదజాలంతో దూషించారు.. దళితులకు అంగ, ఆర్థిక బలం లేకపోయినా మాకు ఓటు బలం ఉందన్నారు.. దళితులకు క్షమాపణ చెప్పాలని అడగటం తప్పా..? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కు తగ్గేది లేదు.. నన్ను తగులబెట్టినా భయపడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ దళిత నేతలను ఒక్కటే అడుతున్నా.. వాళ్ళు ఆ మాటలు అనలేదా..? అని ప్రశ్నించారు. మార్గమధ్యంలో ఆగి రాళ్ళు తెచ్చుకున్నారు.. ఎన్ఎస్జీ కమాండెంట్ కు తగిలిన గాయాలు టీడీపీ కార్యకర్తలు వేసిన రాళ్ల వల్లే అన్నారు.. ఇక, చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు నిరసనలు ఆగవు.. ఈ నిరసనలు ఒక్క యర్రగొండపాలెంతో ఆగవు.. రాష్ట్రంలో ఉన్న ఏ ఎస్సీ నియోజకవర్గం వెళ్ళినా నిరసన తెలియజేస్తాం అని ప్రకటించారు.

చంద్రబాబు నాపై నిరాధార ఆరోపణలు చేశారు.. టీడీపీ నేతల కబ్జాలు రుజువు చేసేందుకు నేను సిద్ధం అని సవాల్‌ చేశారు ఆదిమూలపు సురేష్‌.. చంద్రబాబు ఛాలెంజ్ లకు కాలమే సమాధానం చెబుతుందన్న ఆయన.. యర్రగొండపాలెం అంటే వైసీపీ కంచుకోట.. ఇక్కడ టీడీపీకి జనాదరణ లేదని స్పష్టం చేశారు. దాడి ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టాలి.. మేము అవేశ పడితే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.. చంద్రబాబు రాకతో ప్రకృతి కూడా కంపించింది.. టీడీపీ దళిత నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. రాళ్ళ దాడి ఘటన బాధ్యులను గుర్తించాం.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.. కాగా, టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు యర్రగొండపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఇద్దరికి, చంద్రబాబుకు సెక్యూరిటీ అధికారికి గాయాలైన విషయం విదితమే.