NTV Telugu Site icon

Minister Achchennaidu: విత్తనాలు, ఎరువుల కొరత రావొద్దు.. మంత్రి అచ్చెన్న ఆదేశం.

Achchennaidu

Achchennaidu

Minister Achchennaidu: విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు అచ్చెన్నాయుడు.. ఈ సందర్భంగా శాఖాపరమైన వివిధ అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు.. ఖరీఫ్ సీజన్‌లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రిన్సిపల్ సెక్రటరీ జీకే ద్వివేది సహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఎట్టిపరిస్థితుల్లో విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.. పంటలకు నాణ్యమైన పురుగులు మందులు అందించాలని సూచించారు.. ఇక, ఈ నెల 18వ తేదీన రైతులకు అందించబోయే PM కిసాన్ తదితర అంశాలపై కూడా చర్చించారు. ప్రతీ అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.

Read Also: RC16 : రాంచరణ్ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్..?

కాగా, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే పాలనపై దృష్టి సారించింది.. ఇప్పటికే శాఖల కేటాయింపు పూర్తి కావడంతో.. బాధ్యతలు స్వీకరించిన మంత్రులు పనిలో మునిగిపోయారు.. సీనియర్‌ నేత అయిన అచ్చెన్నాయుడుకు వ్యవసాయ, కో-ఆపరేటివ్‌, మార్కెటింగ్‌, డైరీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫిషరీస్‌ వంటి కీలక శాఖలు కేటాయించారు.. సీఎం చంద్రబాబు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అచ్చెన్నాయుడు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి గా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. తనతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు తీసుకున్న అందరికీ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన విషయం విదితమే.