Site icon NTV Telugu

Uddav Shivsena: మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చే యోచనలో ఉద్ధవ్-శివసేన.. ఎందుకంటే?

Shivsena

Shivsena

Uddav Shivsena: స్వాతంత్య్ర సమరయోధుడు వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన తీవ్ర విమర్శలతో నొచ్చుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే యూపీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మహావికాస్‌ అఘాడీకి గుడ్‌బై చెప్పే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఆదిత్య థాకరే ఇటీవలే భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌తో కలిసి పాదయాత్ర కూడా చేశారు. అయితే శివసేన స్ఫూర్తిదాతగా భావించే వీరసావర్కర్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేయడాన్ని శివసేన తప్పుబడుతోంది.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి వీర్‌ సావర్కర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. గురువారం భారత్‌ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని అకోలాలో మీడియాతో మాట్లాడిన రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి మరింత దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఆయన బ్రిటీషర్లకు సాయం చేశారని.. గాంధీ, నెహ్రూ, సర్దార్‌ పటేల్‌లాంటి నేతలకు నమ్మక ద్రోహం చేశారని రాహుల్‌ ఆరోపించడం గమనార్హం. గాంధీ, నెహ్రూ, పటేల్‌లకు ద్రోహం చేయడంతో పాటు సావర్కర్ బ్రిటీష్ వారికి సహకరించారని కూడా రాహుల్ ఆరోపణలు చేశారు. సావర్కర్ పిరికివాడని కూడా రాహుల్ ఆరోపించారు. వీర సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్‌ను అవమానించడం తగదని హెచ్చరించారు.

JP Nadda: కాంగ్రెస్ మాత్రమే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయగలదు.. ఏకం కాదు..

కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీ ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు ఉద్ధవ్‌ థాక్రే మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో పాటు మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ షిండే జట్టులో చేరిపోయారు. ఉద్ధవ్ దాదాపు ఒంటరివారైపోయారు. అయితే సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్ధవ్ యూపీఏకు గుడ్‌బై చెబితే తిరిగి ఎన్డీయేలో చేరే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Exit mobile version