ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడే అవకాశం తనకు త్వరగా వచ్చి ఉంటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే 5000 పరుగులు ఎక్కువే చేసేవాడిని అని అన్నాడు. రికార్డులు కూడా తనవే ఎక్కువగా ఉండేవని పేర్కొన్నాడు. 28 సంవత్సరాల వయసులో అంతర్జాతీయం అరంగేట్రం చేసిన హస్సీ.. కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 49 సగటుతో 12,398 పరుగులు చేశాడు. హస్సీ దేశీయ కెరీర్ ఎక్కువగా ఉండగా.. అంతర్జాతీయ కెరీర్ మాత్రం తక్కువగా ఉంది. ది గ్రేడ్ క్రికెటర్ యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన సంభాషణ సందర్భంగా ఆస్ట్రేలియా దిగ్గజం ఈ కామెంట్స్ చేశాడు.
‘సచిన్ టెండూల్కర్ లాగా నాకు ముందుగా అవకాశం వచ్చి ఉంటే నా గణాంకాలు భిన్నంగా ఉండేవి. నేను దాని గురించి చాలా ఆలోచించాను. నేను బహుశా సచిన్ కంటే 5000 పరుగులు ఎక్కువే చేసేవాడిని. అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక విజయాలు, అత్యధిక యాషెస్ విజయాలు, చాలా ప్రపంచకప్‌లు కూడా నావే ఉండేవి. కానీ నేను ఉదయం నిద్రలేచి అదంతా కేవలం కల అని గ్రహిస్తాను. నాకు అవకాశం ఆలస్యంగా వచ్చినప్పటికీ గొప్పగా భావిస్తున్నా. ఆటపై నాకు మంచి అవగాహన ఉంది’ అని మైఖేల్ హస్సీ ‘ది గ్రాండ్ క్రికెటర్’ యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో మైఖేల్ హస్సీ అన్ని ఫార్మాట్లలో కలిపి 12,398 పరుగులు చేశాడు. 302 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు ఉన్నాయి. అతని టెస్ట్ స్కోరు 6235 కాగా.. వన్డేల్లో 5442 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 15,921 టెస్ట్ పరుగులు… వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. పొట్టి ఫార్మాట్‌లో హస్సీ 721 పరుగులు చేయగా.. టెండూల్కర్ ఒకే టీ20 మ్యాచ్‌లో 10 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా 2007 వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్లలో హస్సీ సభ్యుడు. హస్సీ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచం, అభిమానులలో చర్చకు దారితీసింది.
