NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీనే టాప్‌ స్కోరర్‌.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జోస్యం!

Virat Kohli

Virat Kohli

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ జోస్యం చెప్పాడు. క్లార్క్‌ తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొనగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాప్‌ స్కోరర్‌ ఎవరన్న ప్రశ్నకు విరాట్ పేరు చెప్పాడు. ‘పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయిన విషయం పక్కన పెడితే.. కోహ్లీ మొదటి గేమ్‌లో సెంచరీ చేయడం నన్ను చాలా భయపెడుతోంది. ఈ సిరీస్‌లో విరాట్ భారీగా పరుగులు చేస్తాడు. ట్రోఫీలో టాప్‌ స్కోరర్‌ అతడే’ అని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు.

విరాట్ కోహ్లీ గత కొన్నాళ్లుగా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడిన విషయం తెలిసిందే. ఇటీవల స్వదేశంలో న్యూజీలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో విరాట్ 93 పరుగులే చేశాడు. దాంతో అతడిపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే కొందరు భారత మాజీలు విరాట్ ఫామ్ అందుకుంటాడని చెప్పారు. మాజీలు చెప్పినట్లే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో సెంచరీ బాది గాడిలో పడ్డాడు. పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 143 బంతుల్లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్ శతకం బాదడంతో ఆస్టేలియా జట్టుతో పాటు మాజీలలో కూడా భయం మొదలైంది. సిరీస్‌లో కింగ్ కోహ్లీ మరిన్ని సెంచరీలు బాదుతాడని భయపడుతున్నారు.

Also Read: BCCI Secretary: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. బీసీసీఐ కార్యదర్శి రేసులో ఎవరున్నారంటే?

అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టుపై కూడా మైకేల్ క్లార్క్‌ స్పందించాడు. ‘రెండో టెస్టులో మార్నస్‌ లబుషేన్ సెంచరీ చేస్తాడు. అయితే ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్‌ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు. పేసర్ మిచెల్ స్టార్క్‌ పింక్‌ బాల్‌ను మరింత స్వింగ్ చేయగలడు. అడిలైడ్‌లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అతడు చెలరేగే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా కూడా చెలరేగుతాడు. ఆస్ట్రేలియా తరఫున స్టార్క్‌, భారత్ తరఫున బుమ్రా ఎక్కువ వికెట్లు తీస్తారు’ అని క్లార్క్‌ చెప్పుకొచ్చాడు.

Show comments