Cuauhtemoc: అమెరికా న్యూయార్క్ నగరంలో శనివారం రాత్రి ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. మెక్సికో నేవీకి చెందిన ట్రైనింగ్ షిప్ కౌటెమోక్ (Cuauhtemoc) బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొని రెండు ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో మరో 19 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇక న్యూయార్క్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన శనివారం రాత్రి 8:20 గంటల సమయంలో జరిగింది. షిప్ కెప్టెన్ నౌకను నియంత్రిస్తూ ఉండగా పవర్ కోల్పోవడంతో నౌక అనుకోకుండా బ్రూక్లిన్ బ్రిడ్జ్ వైపు వెళ్లింది. దానితో అది బ్రిడ్జ్ అడుగు భాగంలో ఉన్న అభట్‌మెంట్‌ను ఢీకొంది.
Read Also: IMF: పాకిస్తాన్‌కు IMF షాక్.. కొత్తగా మరో 11 షరతులు..!
ఈ కౌటెమోక్ నౌక 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు కలిగి ఉంది. దీనిలో మూడు భారీగా ఉన్న దండాలు ఉన్నాయి. అయితే, బ్రూక్లిన్ బ్రిడ్జ్ మద్యభాగంలో ఉన్న గరిష్ఠ క్లియరెన్స్ 135 అడుగులు మాత్రమే. నౌక మస్తుల పొడవు 147 అడుగులు కావడంతో ఇవి బ్రిడ్జ్‌ను ఢీకొట్టి విరిగిపోయాయి. ఈ సమయంలో నౌకపై ఉన్న నావికుల్లో పలువురు పైభాగంలో ఉండగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నౌక 1982లో ప్రారంభమై ప్రతి సంవత్సరం మెక్సికన్ నావల్ మిలటరీ స్కూల్ క్యాడెట్ల తుది శిక్షణ ప్రయాణానికి ఉపయోగించబడుతోంది. ఈ సంవత్సరం కూడా ఈ నౌక ఏప్రిల్ 6న మెక్సికోలోని అకపుల్కో పోర్టు నుంచి బయలుదేరి ఐస్‌లాండ్‌కు చేరే లక్ష్యంతో సాగుతోంది. న్యూయార్క్‌లో మంగళవారం నుంచి నౌక డాక్ వద్ద నిలిచింది. శనివారం నాడు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన జనం మధ్య నౌక నగరం విడిచి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Read Also: Abhishek-Aishwarya Rai: పెళ్లి వేడుకలో కూతురితో కలిసి రచ్చరచ్చ చేసిన బచ్చన్ దంపతులు..!
ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బామ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కౌటెమోక్ నౌకలోని ఇద్దరు సిబ్బంది మృతిపై మేము ఎంతో విచారిస్తున్నాం అని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలో ఇటీవల జరిగిన రెండో పెద్ద షిప్-బ్రిడ్జ్ ప్రమాదం. 2024 మార్చిలో బాల్టిమోర్‌లో ఓ భారీ నౌక బ్రిడ్జ్‌ను ఢీకొనడంతో అది కూలిపోయి ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
https://twitter.com/GeneGreen344103/status/1923992632843436307
