NTV Telugu Site icon

Mercedes-Benz: సింగిల్ ఛార్జింగ్‌పై 949 కిమీ.. గిన్నిస్ రికార్డుల్లో ‘మెర్సిడెస్‌ బెంజ్‌’!

Mercedes Benz Eqs 580 Range

Mercedes Benz Eqs 580 Range

Mercedes-Benz EQS 580 Guinness Record: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌’ బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (బీఈవీ) గిన్నిస్‌ రికార్డును నమోదు చేసింది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌పై బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు 949 కిమీ ప్రయాణించడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. సింగిల్‌ చార్జ్‌తో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన బీఈవీ ఇదేనని గిన్నిస్‌ బుక్‌ వర్గాలు తేల్చాయి.

మార్గ మధ్యంలో వాహన రద్దీ, రహదారి పనులు, దారి మళ్లింపులు, భారీ వర్షాలు ఉన్నా.. మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌ ఈ రికార్డు సాధించడం విశేషం. బెంగళూరు నుంచి దావణగెరె, హుబ్లీ, బెళగావి, కొల్హాపుర్, సతారా, పుణె మీదుగా ప్రయాణించి నవీ ముంబైకి చేరింది. ప్రతి 100 కిమీ దూరానికి 11.36 కిలోవాట్‌ అవర్‌ విద్యుత్‌ పవర్‌ను ఈ కారు వినియోగించుకుంది. ‘ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ’ కారు నెలకొల్పిన రికార్డును మెర్సిడెస్‌ బెంజ్‌ బద్దలు కొట్టింది. యూకేలో ఆ కారు సింగిల్ ఛార్జింగ్‌పై 916.74 కిమీ ప్రయాణించింది.

Also Read: Ganesh Chaturthi 2024: ఆ గ్రామంలో ‘ఒక్కడే’ వినాయకుడు.. 40 ఏళ్లుగా ఆనవాయితీ! కారణం ఏంటంటే

‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఈక్యూఎస్‌ కారు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ను గెల్చుకోవడం పట్ల మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించడానికి కారణమైన ఆటోకార్‌ ఇండియా బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న చకాన్‌ ప్లాంట్‌లో ఈ కార్లు తయారవుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ కారు ధర రూ.1.95 కోట్లుగా ఉంది.