Memantha Siddham Bus Yatra: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు ముగిసింది.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం జగన్.. 86 నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రను ఈ రోజు అక్కవరం ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభతో ముగించారు. 22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర సాగగా.. యాత్రలో భాగంగా 16 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు వైసీపీ అధినేత.. వివిధ వర్గాలతో 6 ప్రత్యేక సమావేశాలలో పాల్గొన్నారు. 9 చోట్ల భారీ రోడ్ షోలలో పాల్గొన్నారు.. ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజకవర్గాల మీదుగా సాగింది..
రెండోసారి అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగిసింది. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో ఎండ్ అయింది. మొత్తం 2100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర సాగింది. మొత్తం 86 నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్… ఇప్పటివరకు 16 బహిరంగసభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9చోట్ల భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు.
సిద్ధం సభలు జరగని జిల్లాలను టార్గెట్ చేసి.. ఈ యాత్ర షెడ్యూల్ ఫిక్స్ చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, మార్చి 10న ప్రకాశం జిల్లా మేదరమెట్లలో చివరిదైన నాలుగో సిద్ధం సభ నిర్వహించారు. ఆ సభలు జరగని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లారు జగన్. మార్చి 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో బహిరంగ సభ జరిగింది. తర్వాత రోజు నద్యాలలో, ఆ తర్వాతి రోజు ఎమ్మిగనూరులో సభ నిర్వహించారు. రంజాన్ సందర్భంగా అనంతపురం జిల్లా కదిరిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు జగన్. ఉదయం వివిధ వర్గాలతో సమావేశాలు, తర్వాత బస్సుయాత్ర, సాయంత్రం బహిరంగ సభ.. ఇలా క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం జరిగింది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ప్రతి జిల్లాలోనూ భారీగా జనస్పందన వచ్చింది. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే భేదం లేదు. ఎక్కడ బస్సుయాత్ర జరిగినా.. జగన్ కోసం జనం తరలివచ్చారు. ప్రతీ సభలో జగన్ ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేమంతా సిద్ధం యాత్రలో ప్రజలతో జగన్ కలసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బస దగ్గరికి వచ్చిన వారందరినీ పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్న తరువాతే ఆరోజు యాత్రను మొదలుపెట్టేవారు జగన్. ఇలా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు యాత్ర సాగించారు జగన్. ఇప్పుడు మూడో విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు.