Mehbooba Mufti: బీజేపీ పార్టీ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ. ఏదో రోజు బీజేపీ భారత జాతీయ జెండాను మార్చి కాషాయ జెండాను తీసుకువస్తారని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీనగర్ లో మాట్లాడిన ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని, జెండాను దోచుకున్న విధంగా బీజేపీ జాతీయ జెండాను కూడా మార్చి వేస్తుందంటూ ఆరోపించారు. రాబోయే కాలంలో బీజేపీ రాజ్యాంగాన్ని, దేశంలోని లౌకిక పునాదులను కూడా పెకిలించివేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని మతతత్వ దేశంగా మారుస్తారని వ్యాఖ్యానించారు. దేశం 75వ స్వాతంత్య్రాన్ని జరుపుకునేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో బీజేపీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంపై మహబూబా ముఫ్తీ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
Read Also: Kachanatham Case: తమిళనాడు కోర్టు సంచలన తీర్పు.. 27 మందికి జీవిత ఖైదు శిక్ష విధింపు
ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు కాశ్మీర్ రాజకీయ పార్టీల ప్రముఖులు వారి ఇళ్ల వద్ద జాతీయ జెండాను పెట్టాలంటూ పిలుపునిచ్చారు. దీన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ తిప్పికొట్టారు. లక్షల మంది కాశ్మీరీలు ప్రాణం త్యాగం చేసైనా జమ్మూ కాశ్మీర్ జెండాను, రాజ్యాంగాన్ని తిరిగి తెచ్చుకుంటామని మహబూబా ముఫ్తీ అన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ… సామాజిక భద్రతా పథకాలు, ఈ- గవర్నెన్స్, స్టార్ట్ అప్స్ లో జమ్మూ కాశ్మీర్ చాలా డెవలప్ అయిందని అన్నారు. గత ఏడు నెలల్లోనే కోటికిపైగా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించారని ఆయన అన్నారు.
