Site icon NTV Telugu

Telangana Budget 2024: త్వరలో మెగా డీఎస్సీ.. 15000 మంది కానిస్టేబుళ్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు

Telangana Budjet

Telangana Budjet

Telangana Budget 2024: డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మెగా డీఎస్సీ వేయబోతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టివిక్రమార్క వెల్లడించారు. సుమారు 15000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేయబోతున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ 1 లో 64 అదనపు పోస్టులు జత చేశామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా రుణమాఫీపై భట్టి మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలో చర్యలుంటాయని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర కూడా కల్పిస్తామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌లో మూసీ అభివృద్ధికి రూ.1000 కోట్లు ప్రతిపాదించారు. మూసీ నదిని హైదరాబాద్ మెడలో అందమైన హారంలా తీర్చిదిద్దుతామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా పాతబస్తీలోని పాదచారుల జోన్‌లు, పీపుల్స్ ప్లాజాలు, హెరిటేజ్ జోన్‌లు, హాకర్స్ జోన్‌లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు.

Read also: Telangana Budget: తెలంగాణ బడ్జెట్ హైలెట్స్ ఇవే..

ఓటింగ్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రైతుబంధు నిబంధనల సవరణ, నిజమైన అర్హులైన వారికి రైతు భరోసా కింద రూ. 15వేలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమం ఆధారంగా రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బీమా పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించబోతున్నామని ఆర్థిక భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ పథకాన్ని అమలు చేయాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. దీని అమలుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ. 2,418 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ. 16,825 కోట్లు ప్రతిపాదించినట్లు భట్టి తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అధునాతన వసతులతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు. కళాశాల స్థాయి ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ విద్యార్థులు పోటీ ప్రపంచంలో సత్తా చాటుతారన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల ఓటన్ ఖాతా బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు.
Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.

Exit mobile version