NTV Telugu Site icon

Measles Cases: ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్.. నెలలో 13 మంది మృతి

Measles

Measles

Measles Cases: దేశ ఆర్థిక రాజధాని ముంబై లో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. చిన్నారులకు సోకే ఈ అంటువ్యాధి పసిపిల్లల ప్రాణాలు బలిగొంటుంది. ఈ వ్యాధి కారణంగా ఇటీవల ఎనిమిదినెలల చిన్నారి చనిపోయింది. దీంతో నెల రోజుల్లో మీజిల్స్ కారణంగా 13 మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ అప్రమత్తమైంది. బీహార్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మీజిల్స్ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 233 మీజిల్స్ కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. గత కొన్నేళ్లలో ఈ స్థాయి కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. బుధవారం 30 మంది చిన్నారులు మీజిల్స్ వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, 22 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read Also: Russia – Ukraine War : రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్

ముంబైతోపాటు సమీపంలోని మాలేగావ్, భివండి, థానే, నాసిక్, అకోలా, కల్యాణ్ తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువ వస్తున్నాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా మీజిల్స్ కేసులు ప్రబలుతున్నాయి. రాంచీ, అహ్మదాబాద్, మలప్పురంలలో పిల్లలలో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుదలను అంచనా వేయడానికి.. నివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాలను నియమించింది. కోవిడ్ వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించలేదని, దీంతో మీజిల్స్ వ్యాధి పెరుగుతోందంటున్నారు. చిన్నపిల్లల్లో సోకే ఈ వ్యాధిని నియంత్రించడానికి రెండు డోసుల వ్యాక్సిన్ వేస్తుంటారు. 9-15 నెలల మధ్య వయసున్న చిన్నారులకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై పరిధిలో అర్హత కలిగిన వారిలో 41 శాతం మంది చిన్నారులు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు చెప్పారు. కనీసం 20వేల మందికిపైగా చిన్నారులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందన్నారు.

Show comments