Mayor Sravanthi: నెల్లూరు నగరపాలక సంస్థ సమావేశంలో అజెండాలోని అంశాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ కారణాలతోనే తనపై దాడి చేశారని నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో పెట్టడాన్ని తాను వ్యతిరేకించలేదని.. కేవలం ఫొటో గురించి మాట్లాడుతుండగానే ఒక్కసారిగా తన పోడియం వైపు దూసుకు వచ్చారన్నారు. అంతే కాకుండా సమావేశాన్ని వాయిదా వేసి వెళ్తుండగా తనపై ముగ్గురు కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిని తాను సహించబోనని హెచ్చరించారు మేయర్ స్రవంతి..
Read Also: Hima Varsha Reddy: మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దినకర్మ రోజు ఆమె కూతురు కీలక నిర్ణయం..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో విషయంపై కమిషనర్‌తో మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు మేయర్ స్రవంతి.. సమావేశాన్ని వాయిదా వేసి వెళ్తున్న నాపై దాడి చేశారు.. నా చీర చిరిగే విధంగా అడ్డుకున్నారు.. రాజకీయ కుట్రలో భాగంగా ఇలా చేశారని మండిపడ్డారు. ఎలాగైనా నన్ను అవమానం, అస్వస్థతకు గురి చేయాలనేదే వారి లక్ష్యం.. నన్ను అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.. నా పై జరిగిన దాడికి సంబంధించి ఎస్టీ కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు..
ముఖ్యమంత్రి ఫొటో కౌన్సిల్ హాల్‌లో పెట్టడం ఆనంద దాయకం.. కౌన్సిల్ హాల్‌లో సీఎం జగన్ ఫొటో పెట్టిన విషయం తెలియదని మాత్రమే చెప్పానన్నారు స్రవంతి. ఎందుకు పెట్టారుని నేను మాట్లాడలేదు.. నేను చెప్పే మాటలు సభ్యులు వినిపించుకోలేదు.. దీంతో సమావేశాన్ని వాయిదా వేశానన్నారు.. వినిపించుకోకుండా సభ్యులు సమావేశంలో గందరగోళం చేశారు.. సభ వాయిదా వేసి వస్తున్న నన్ను కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస్, మొయిళ్ళ గౌరీ, విజయ భాస్కర్ రెడ్డిలు తోసి నా చీర లాగేంత పరిస్థితి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గిరిజన మహిళయిన నేను దీన్ని ఒక తీవ్ర అవమానంగా భావిస్తున్నా.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా.. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరుకుంటున్నాను అన్నారు నెల్లూరు నగర మేయర్ స్రవంతి.
