NTV Telugu Site icon

హిద్మా రాక నిజమెంత..?

బీజాపూర్ ఎన్ కౌంటర్ తర్వాత ప్రముఖంగా వినిపించిన పేరుమాద్వి హిద్మా.. ఇప్పటికే మావోయిస్టు పార్టీలు గతంలో లాగా పట్టు బిగించలేకపోతుంది. మొన్న ఆర్కే మరణం మావోయిస్టు పార్టీని కలవరపెడితే.. తాజాగా హిద్మా ఆరోగ్యం సైతం దెబ్బతిన్నదనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనను తెలంగాణకు తరలించారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజెన్సీ ఏరియాలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలు హిడ్మాను మోస్ట్ వాటెండ్ గా ప్రకటించి రూ.50లక్షల రివార్డును సైతం ప్రకటించారు. పోలీసుల కూంబింగ్ లు, అనారోగ్య సమస్యలు, కరోనాతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే అతలాకుతలం అవుతోంది.

దీంతో సెంట్రల్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న హిద్మాను తెలంగాణకు పంపించి వైద్యం అందించారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకవేళ అదే నిజమైతే తెలంగాణ పోలీసులు ఈ సారి హిద్మాను పట్టుకునేందుకు కాచుకోని ఉన్నారు. ఐదెంచెల భద్రత వలయం ఉన్న హిద్మాను పట్టుకోవడం పోలీసులకు సవాల్ తో కూడిన పని .. అనారోగ్య కారణాలతో ఉన్న హిద్మా తెలంగాణలో ప్రవేశించడం అసాధ్యమని పోలీసులు అంటున్నారు. దీనిపై ఇంటిలిజెన్స్, పోలీసులు ఏ విధమైన ప్రకటన చేయకపోయినప్పటికీ, ఈ ప్రచారంతో ఏజెన్సీ ఏరియాలో పోలీసులు జల్లెడ పడతున్నారు. దీంతో ఇక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.