‘యాషెస్’.. టెస్టుల్లో ప్రతిష్ఠాత్మక సిరీస్‌గా కొనసాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ యాషెస్ సిరీస్ కోసం హోరాహోరీగా తలపడుతాయి. పోటీ ఎంతలా ఉంటుందంటే.. ప్లేయర్ గాయపడినా కూడా జట్టు కోసం ఆడుతుంటాడు. ఐదు టెస్టుల సిరీస్ యాషెస్‌పై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 21 నుంచి యాషెస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ మ్యాథ్యూ హేడెన్ కీలక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్‌మెంట్ కారణంగా అతడి కూతురు, వ్యాఖ్యాత గ్రేస్ హేడెన్ ఇబ్బంది పడ్డారు. దాంతో ప్రత్యర్థి బ్యాటర్ జో రూట్‌ను వేసుకునే పరిస్థితి వచ్చింది.
గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ (15921) రికార్డుకు చేరువగా వచ్చాడు. రూట్ మరో 2400 పరుగులు చేస్తే.. సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది. 34 ఏళ్ల రూట్ ఇదే ఫామ్ కొనసాగిస్తే ఆ మైలురాయి పెద్ద కష్టమేమీ కాదు. ఈ క్రమంలో యాషెస్ టెస్టు సిరీస్ 2025 రూట్‌కు అత్యంత కీలకంగా మారింది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై రూట్ ఒక్క టెస్టు శతకం చేయలేదు. ఈ నేపథ్యంలో రూట్‌కు మ్యాథ్యూ హేడెన్ ఓ సవాల్ విసిరాడు. ఒకవేళ యాషెస్ సిరీస్‌లో రూట్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోతే.. తాను మెల్‌బోర్న్ మైదానంలో నగ్నంగా నడుస్తా అని పోస్టు పెట్టాడు.
Also Read: IND vs PAK: ఈ క్రేజ్ వేరే లెవల్ అయ్యా.. రూ.4 లక్షల ప్రైజ్ టికెట్స్ కూడా సోల్డ్ అవుట్!
మ్యాథ్యూ హేడెన్ పోస్టుకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ కూడా స్పందించారు. తనను నాన్న నుంచి కాపాడు అని ప్రత్యర్థి జో రూట్‌కు ఓ విన్నపం చేశారు. ‘ప్లీజ్ ప్లీజ్ జో రూట్.. యాషెస్ టెస్టు సిరీస్‌లో ఒక్క సెంచరీ అయినా కొట్టు’ అని కామెంట్ చేసింది. తన తండ్రి మ్యాథ్యూ హేడెన్ నగ్నంగా నడిస్తే చూడలేనని రూట్‌కు పరోక్షంగా చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. రూట్ ఆస్ట్రేలియాలో 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. ఒక్కసారి కూడా సెంచరీ మార్కును అందుకోలేదు. తొమ్మిది హాఫ్ సెంచరీలతో 892 పరుగులు చేశాడు.. కానీ మూడంకెల స్కోర్ చేయలేదు.
