వాయిదా అనంతరం శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. ఛైర్మన్ పోడియం చుట్టూ 23 మంది మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. మార్షల్స్ రక్షణలో సభ కాసేపు కొనసాగింది. మార్షల్స్ ఏర్పాటుపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దుష్ట సంస్కృతి అని బొత్స పేర్కొన్నారు. ఇది పెద్దల సభ అని, ఇలా చేయడం సబబు కాదని ఛైర్మన్ బదులిచ్చారు. మీ సీట్లులో ఉండి నిరసన తెలుపుకోవచ్చని ఛైర్మన్ సూచించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనమండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు.
విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ‘బాబు షూరిటీతో ప్రజలను మోసం చేశారు. ప్రభుత్వం వచ్చిన మరునాటి నుంచే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. ఇవాళ మేము సభలో ఇదే అంశంపై ప్రశ్నించాం. మేము ప్రశ్నించటం తప్పు అన్నట్లుగా మార్షల్స్‌ను సభలో మోహరించారు. వారి వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చాం. ఏమైనా అడిగితే గత ప్రభుత్వ బకాయిలు అంటారు. డిసెంబర్ వరకు బకాయిలు మొత్తం ఇచ్చాం. ఆ తరువాత ఎన్నికలు రావటంతో పెండింగ్ పడ్డాయి. ఏదైనా అడిగితే వచ్చే నెల, వచ్చే నెల అంటారు. ఈ ప్రభుత్వం మాటలు తప్ప ఏమీ చేయటం లేదు’ అని అన్నారు.
‘సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం మేం మాట్లాడితే మార్షల్స్ మాపై దాడికి ప్రయత్నిస్తారా?. ప్రజల పక్షాన పోరాడుతున్న మా అందరినీ ఇలా చేస్తారా?. ప్రభుత్వ విధానాలను ఖండిస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు ఇస్తారు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తారు.. తేదీలు ప్రకటించండి. వాళ్ళే లేఖలు ఇచ్చి.. వాళ్ళే మోసం చేస్తున్న అసమర్థ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి లేఖ ఇస్తే ఏపీపీఎస్సీ తిరస్కరించిన సందర్భం ఏమైనా ఉందా. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తున్నాం’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.