NTV Telugu Site icon

Margani Bharat: ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారో.. మేం ఏం తప్పులు చేసామో తెలియటం లేదు..

Margani Bharat

Margani Bharat

Margani Bharat: అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలో పొందలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్‌.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనను ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారో అర్థం కావట్లేదు.. ఏం తప్పులు చేసామో తెలియటం లేదన్నారు. రెల్లి పేటలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైయస్సార్ వెనుకే జనం ఉంటారు.. అక్కడ కూడా ఎలా తక్కువ వచ్చింది అర్థం కావటం లేదు అన్నారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను.. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను.. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు రాజమండ్రిలో ఈ తరహా డెవలప్మెంట్ ఎప్పుడు జరగలేదన్నారు భరత్.

Read Also: Road Accident : ఘోర ప్రమాదం.. భక్తులతో నిండిన బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. 35 మందికి గాయాలు

ఇక, రాజమండ్రిలో మోరంపూడి శిలాపలకాన్ని టీడీపీ నేతలు కూల్చేసినా ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం అన్నారు భరత్.. శిలాపలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పటం ఎంతవరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు.. రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూకలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు.. దానిని మాత్రమే ప్రతిఘటించామని గుర్తుచేసుకున్నారు. అమరావతిలో కూల్చేసిన ప్రజావేదిక ఎన్జీటీ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఉందన్న ఆయన.. ఉండ్రాజవరం, జొన్నాడ, కైకలూరు, తేతలి నాలుగు ఫ్లై ఓవర్లు మంజూరు చేసిన జీవో కాపీలు కూడా చూపించాం.. నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు 2020లోనే మంజూరు చేశారు.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా బాధ్యత ఉంది అన్నారు. తమకు ఇంకా మంచి చేస్తారని ప్రజలు భావించి వారికి విజయాన్ని కట్టబెట్టారు.. ఇచ్చిన హామీలు ఎంతమేర నిలబెట్టుకుంటారో చూద్దాం అన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్.