Maoist Sujathakka: గద్వాల ప్రాంతానికి చెందిన మావోయిస్టు సుజాతక్క 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు పలికారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమబెంగాల్‌లో 2011 జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య ఆమె. సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమె 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జిగా ఉన్నారు.
READ ALSO: Chutneys Restaurants : చట్నీస్ కిచెన్ లో కాక్రోచ్ పార్టీ.. లోపల అంతా గబ్బుగబ్బు..!
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ‘ఆమె స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు. ఆమె మొదట్లో ఆర్‌ఎస్‌యూ, జన నాట్యమండలిలో పని చేశారు. 1996లో కమాండర్‌గా విధులు నిర్వహించారు. 2001లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో సుజాతక్క బయటికి వచ్చారు. ఆమెకు రూ.25 లక్షల రివార్డు అందిస్తాం. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. మావోయిస్టులు చాలా మంది లొంగిపోతున్నారు అని తెలిపారు.
ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు పార్టీలో తెలంగాణకి చెందిన వారు 78 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటు అనేది అంత సులభంగా జరుగదు. మావోయిస్టులు లొంగిపోవడం అనేది రెండు, మూడు రోజుల్లో సాధ్యం అయ్యేది కాదు. పోలీసులకు మావోలు లొంగిపోవాలంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. దాని ప్రకారమే వారు లొంగిపోతారు. గతేడాది 22 మంది మావోయిస్టులు తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. గతంలో కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్య చర్చలు జరిగాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు వారిని కాపాడుకునేందుకే చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణ కమిటీలో 11మంది మావోయిస్టులు తెలంగాణ వారు, ఇతర రాష్ట్రాల వారు 62 మంది ఉన్నట్లు గుర్తించాం. తెలంగాణ కమిటీలో మొత్తం 73మంది మావోయిస్టులు ఉన్నట్లు డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
READ ALSO: Eye Twitch Astrology: ఏ కన్ను అదిరితే సమస్యలు వస్తాయో తెలుసా.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే!
