NTV Telugu Site icon

Manoj Tiwary Retirement: 5 రోజుల వ్యవధిలోనే.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న భారత క్రికెటర్!

Manoj Tiwary Retirement

Manoj Tiwary Retirement

Manoj Tiwary is Returning to Cricket after CAB Meeting: భారత వెటరన్ ప్లేయర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్‌ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీతో చర్చించిన తర్వాత మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈరోజు క్యాబ్‌ అధికారులతో సమావేశం అనంతరం మీడియా సమక్షంలో తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మనోజ్‌ తివారీ క్రికెట్ మైదానంలోకి తిరిగి రాబోతున్నాడని క్యాబ్‌ వర్గాలు అంటున్నాయి.

మనోజ్‌ తివారీ గత గురువారం (ఆగష్టు 3) రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఐదు రోజుల వ్యవధిలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బెంగాల్ మంత్రి వెనక్కి తీసుకున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆటను కొనసాగించాలని మనోజ్‌ తివారీని క్యాబ్‌ ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీ అడిగారట. ఎందుకంటే.. గత ఏడాది మనోజ్ సారథ్యంలో బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీలో రన్నర్స్‌గా నిలిచింది. మనోజ్ జట్టు నుంచి నిష్క్రమించడంతో మిడిల్ ఆర్డర్‌ బలహీనపడింది. అంతేకాదు బెంగాల్ జట్టులో అనుభవజ్ఞుడైన క్రికెటర్ కూడా మనోజే.

బెంగాలీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ 2008 నుంచి 2015 వరకు టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడారు. వన్డేల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 287 రన్స్ బాదారు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 104. మూడు టీ20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్‌ చేసిన మనోజ్‌..15 రన్స్ చేశారు. ఐపీఎల్‌లో 98 మ్యాచులలో 1,695 రన్స్ చేయగా.. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 75 నాటౌట్. ఇక 141 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 9908 పరుగులు చేయగా.. ఇందులో 29 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 169 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 5581 రన్స్ చేసిన తివారీ.. 183 టీ20ల్లో 3436 పరుగులు బాదారు.

మనోజ్‌ తివారీ ఫస్ట్‌క్లాస్‌ కెరీర్ రికార్డు బాగానే ఉన్నా.. అంతర్జాతీయ కెరీర్ మాత్రం గొప్పగా లేదు. 15 మ్యాచులతోనే అతడి కెరీర్ ముగిసింది. బెంగాల్ జట్టు తరఫున ఆడుతూ అప్పుడప్పుడు మెరుస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేబినెట్‌లో క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిగా అయన నియమితులయ్యారు. మంత్రిగా కొనసాగుతూనే క్రికెట్ ఆడుతున్నారు. 2022-23 రంజీ ట్రోఫీ సీజన్‌లోబెంగాల్‌ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు.

Show comments