Site icon NTV Telugu

Maratha Reservation: ‘మేము గెలిచాము’.. నిరాహార దీక్షను విరమించిన మరాఠా నాయకుడు

Manoj Jarange Patil

Manoj Jarange Patil

Maratha Reservation: మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరాఠాలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మనోజ్ జరంగే పాటిల్ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రాథమిక డిమాండ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు రిజర్వేషన్ల డిమాండ్‌తో నిరసన తెలుపుతున్న వారిపై దాఖలైన అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. క్యాబినెట్ సబ్-కమిటీతో సమావేశం తర్వాత, ప్రభుత్వం తీర్మానం జారీ చేసిన అనంతరం.. తన మద్దతుదారులు రాత్రి 9 గంటలకు ముంబైని ఖాళీ చేస్తారని పాటిల్ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత “మేము గెలిచాము” అని చెబుతూ ఆయన తన 5 రోజుల నిరాహార దీక్షను ముగించారు. మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖేపాటిల్ ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేశారు.

READ ALSO: Udayabhanu: బాలయ్య చూపించే ప్రేమ, నా ఫ్యామిలీ దగ్గర నుంచి కుడా దొరకలేదు

పాటిల్‌ను కలిసిన మంత్రివర్గ ఉపసంఘం
ఇప్పటి వరకు మహారాష్ట్రలో కున్బీ సమాజం OBC వర్గం కింద రిజర్వేషన్‌లను పొందుతోంది. మరాఠా రిజర్వేషన్ సమస్యకు హైదరాబాద్ గెజిట్ సంబంధం ఏంటంటే.. ప్రస్తుత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లోని నిరసన స్థలంలో మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం పాటిల్‌ను కలిసింది. మంత్రులు రాధాకృష్ణ విఖే పాటిల్, మాణిక్‌రావు కోకాటే, శివేంద్ర రాజే భోసలే ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌ను నెరవేర్చడానికి హైదరాబాద్ గెజిట్‌ను అమలు చేయడానికి క్యాబినెట్ సబ్-కమిటీ అంగీకరించిందని చెప్పారు. మంత్రులతో సమావేశం తర్వాత ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీ బలంతో మనం గెలిచాము, ఈ రోజు నేను పేదల శక్తిని అర్థం చేసుకున్నాను” అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ స్పందనతో తాము సంతోషంగా లేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ఆజాద్ మైదాన్‌లో ఆందోళన కొనసాగించాలన్న తన అభ్యర్థనను ముంబై పోలీసులు తిరస్కరించడంతో పాటిల్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, న్యాయమూర్తి ఆర్తి సాథేలతో కూడిన ధర్మాసనం పాటిల్ న్యాయవాదితో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 3 గంటలలోపు వీధుల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించకపోతే, న్యాయమూర్తులు వీధుల్లోకి వస్తారని చెప్పారు. తమ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మరాఠా నాయకుడిని హెచ్చరించారు. ముంబైలోని ఆజాద్ మైదాన్ సమీపంలో వేలాది మంది మరాఠా మద్దతుదారులు సాధారణ ప్రజల జీవితానికి తీవ్ర అంతరాయం కలిగించిన నేపథ్యంలో బెంచ్ ఈవిధంగా స్పందించింది. విచారణ సందర్భంగా నిరసనల వల్ల కలిగిన అసౌకర్యానికి పాటిల్ న్యాయవాది సతీష్ మాన్షిండే పాటిల్ క్షమాపణలు చెప్పారు. 5000 మందితో కూడిన సమావేశానికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు, నిరసనలకు అంత మంది ఎందుకు వచ్చారని కోర్టు పాటిల్‌ను ప్రశ్నించింది. “60,000 మందికి పైగా ప్రజలు నగరంలోకి వచ్చారని మీకు తెలిసినప్పుడు, మీరు ఏ చర్యలు తీసుకున్నారు?” అని ధర్మాసనం ప్రశ్నించింది, బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుందని పేర్కొంది.

READ ALSO: Konaseema : అప్పనపల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ వివాదం.. కోనసీమలో రాజకీయ వేడి

Exit mobile version