NTV Telugu Site icon

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్‌ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ

Manish Sisodia

Manish Sisodia

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు మరో షాక్‌ తగిలింది. సీబీఐ అరెస్ట్‌ చేసిన అనంతరం బెయిల్‌ మంజూరు కాకముందే మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ కోర్టు నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న మనీష్‌ సిసోడియాకు ఈడీ అరెస్ట్‌తో మరో గట్టి దెబ్బ తగిలినట్లు అయింది. ఆయన్ను ఈడీ రేపు కోర్టులో హాజరుపరచనుంది. అదే రోజు ఆయన బెయిల్ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మనీష్‌ సిసోడియా ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన తర్వాత సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయనను ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. ఈయనకు బెయిల్‌ మంజూరు విషయంలో శుక్రవారం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఈడీ ఆయన్ని అరెస్టు చేయడం గమనార్హం.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్‌ కోసం సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. పిటిషన్‌దారుకి ట్రయల్‌ కోర్టు, దిల్లీ హైకోర్టుల నుంచి రక్షణ పొందే వీలుండగా నేరుగా సర్వోన్నత న్యాయస్థానానికి రావడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఆయన బెయిల్‌ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ.. రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి 4న దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలను శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరగాల్సిన తరుణంలో ఈడీ ఆయనను అరెస్ట్‌ చేయడం గమనార్హం.

Read Also: Emergency Landing: ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ నేత సిసోడియా ఎలాగైనా లోపల ఉంచడమే లక్ష్యంగా ఈడీ ఈ చర్య తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.
“మనీష్‌ను మొదట సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐకి ఎటువంటి ఆధారాలు లభించలేదు. దాడిలో డబ్బు దొరకలేదు. రేపు బెయిల్ విచారణ ఉంది. రేపు మనీష్ విడుదలయ్యేవారు. కాబట్టి ఈ రోజు ఈడీ అతడిని అరెస్టు చేసింది. వారికి ఒకే ఒక లక్ష్యం ఉంది. – ప్రతిరోజూ కొత్త ఫేక్ కేసులను సృష్టించడం ద్వారా మనీష్‌ను లోపల ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ప్రజలే సమాధానం చెబుతారు” అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.

Show comments