MLA RK: రాజకీయాల్లో ఉంటే అది వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే అని స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే.. ఆర్ 5 జోన్ లోని లేఅవుట్లను పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. అమరావతి ప్రాంతంలో పేదల సొంత ఇంటి కల నెరవేరనుందని తెలిపారు.. మొత్తం 50 వేల మందిలో 22 వేల మంది లబ్ధిదారులు మంగళగిరి నియోజకవర్గంవారేనని సంతోషం వ్యక్తం చేశారు.. ఇక, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని న్యాయ స్థానాలకు వెళ్ళటం టీడీపీ పెత్తందారీ స్వభావం అర్థం అవుతుంది అని మండిపడ్డారు.. లోకేష్ ను ఓడించటానికే అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నారన్న వాదన కరెక్ట్ కాదని కొట్టిపారేశారు.
Read Also: TigerNageswaraRao: గజదొంగ చనిపొతే మూడు లక్షల మంది చూడడానికి వచ్చారట
లబ్ధిదారుల్లో 80 శాతం మంది మంగళగిరి – తాడేపల్లి పరిధిలో నివాసం ఉంటున్న వారే నని.. బయట నుంచి కొత్తగా వచ్చే ఓటర్లు కాదు అని తెలిపారు ఎమ్మెల్యే ఆర్కే.. దీపావళి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాను అన్నారు. కొద్ది రోజుల పాటు విదేశాల్లో ఉన్నందుకే నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది? అని ఎదురుప్రశ్నించారు.. రాజకీయాల్లో ఉంటే అది సీఎం వైఎస్ జగన్‌తోనేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ స్థలాలను సమాధులుగా పోల్చిన చంద్రబాబుకు మతి స్థిమితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇళ్లు లేని పేదలకు ఇవి తాజ్ మహల్స్ అంటూ అభివర్ణించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కాగా, గత కొంత కాలంగా ఎమ్మెల్యే ఆర్కే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని.. మరోసారి ఆయనకు వైసీపీ టికెట్ వచ్చే అవకాశం లేదని.. అందుకే దూరం జరుగుతున్నారని.. మరో పార్టీలో చేరతారని.. ఇలా ఆర్కేపై రకరకాల ప్రచారాలు సాగుతోన్న విషయం విదితమే.