SSC Exams : నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్‌లో పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం ఆలస్యంగా చేరడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఇంకా ప్రశ్నపత్రం రాకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా అన్ని పరీక్షా కేంద్రాలకు సమయానికి ప్రశ్నపత్రాలను పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, బాయ్స్ హైస్కూల్‌కు ప్రశ్నపత్రం చేరేందుకు గంటకు పైగా ఆలస్యం అయింది. ఈ ఆలస్యంపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించిన కలెక్టర్, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. “ఎంత సమయం ఆలస్యం అయిందో, అంత సమయం విద్యార్థులకు అదనంగా ఇస్తాం” అని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి (D.E.O) పై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో అలసత్వం వహించిన కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష ప్రారంభ సమయంలో ప్రశ్నపత్రం అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు మానసిక ఒత్తిడిని కలిగించింది. అయితే, కలెక్టర్ నిర్ణయం వారికి కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రశ్నపత్రం ఆలస్యం అవ్వడం విద్యా శాఖలో సమర్థవంతమైన నిర్వహణపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమయపాలన విషయంలో మరింత జాగ్రత్త వహించాలని విద్యాశాఖను కోరుతున్నారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది అభినందించినప్పటికీ, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.