NTV Telugu Site icon

Mamata Banerjee Home: ఆయుధాలతో మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నం.. నిందితుడు అరెస్ట్

Mamata Benerjee

Mamata Benerjee

Mamata Banerjee Home: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని శుక్రవారం కారులో ఆయుధాలతో అరెస్టు చేశారు. నల్లకోటు, టై ధరించిన వ్యక్తి హరీష్ ఛటర్జీ స్ట్రీట్‌లోని మమతా బెనర్జీ నివాసంలోకి ‘పోలీస్’ స్టిక్కర్ ఉన్న కారుతో వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ కారును తనిఖీ చేయడంతో అందులో ఆయుధాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వ్యక్తిని నూర్‌ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు మమతా బెనర్జీ తన ఇంట్లోనే ఉన్నారు.

Also Read: New Delhi: ఇండియా శ్రీలంక మధ్య ఆర్థిక భాగస్వామ్యం.. విజన్ డాక్యుమెంట్‌పై ఆమోదం

ఆ వ్యక్తి వద్ద ఆయుధాలు, గంజాయి, బీఎస్‌ఎఫ్, ఇతర వివిధ ఏజెన్సీలకు చెందిన అనేక గుర్తింపు కార్డులను కలిగి ఉన్నాడని కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు. ఆ వ్యక్తి ముఖ్యమంత్రిని కలవాలనుకున్నాడని తెలిపారు. ఇది తీవ్రమైన సమస్య అని, ఆ వ్యక్తి అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి అసంబద్ధంగా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తన కాళీఘాట్ నివాసం నుంచి నగరంలోని సెంట్రల్ ప్రాంతంలో ‘అమరవీరుల దినోత్సవం’ ర్యాలీ వేదికకు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగింది.