Site icon NTV Telugu

Acid Attack: కోర్టు ఆవరణలోనే భార్య ముఖంపై యాసిడ్‌తో దాడి

Acid Attack

Acid Attack

Acid Attack: తమిళనాడులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే తన భార్య ముఖంపై యాసిడ్‌ పోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె పక్కనే ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరందరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కోయంబత్తూరులోని కోర్టు ఆవరణలో జరిగింది.

కోయంబత్తూరులో ఉన్న కోర్టుకు ఓ వివాదం పరిష్కారం కోసం చిత్ర, శివకుమార్ అనే ఇద్దరు భార్యాభర్తలు గురువారం వచ్చారు. భర్త శివకుమార్‌ వేధింపులు తట్టుకోలేక చిత్ర భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం వారు కోర్టుకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. వివిధ కేసుల నిమిత్తం జిల్లాలోని ప్రజలు, న్యాయవ్యాధులు, పోలీసులు, ఇతర సిబ్బందితో కోర్టు ప్రాంగణం అంతా బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణలో భార్య పక్కనే కూర్చున్న భర్త తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో చిత్ర ముఖంపై దాడి చేశాడు. ఒక్కసారిగా యాసిడ్ దాడి చేయడంతో భార్య చిత్రతో పాటు పక్కన ఉన్న ఐదుగురిపై ఆ యాసిడ్ పడడంతో వారికి కూడా గాయాలయ్యాయి. యాసిడ్‌ కారణంగా కోర్టు ఆవరణలోని టేబుల్ కాలిపోయింది. అనుకోకుండా ఈ జరిగిన ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అంతా ఒక్క సారిగా ఉలిక్కిపడింది.

Read Also: BJP: ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు బీజేపీ కొత్త చీఫ్‌ల నియామకం

వెంటనే క్షతగాత్రులందరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం శివకుమార్ తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న న్యాయవాదులు, స్థానికులు శివకుమార్‌ను పట్టుకుని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులపై కోర్టు సీరియస్ అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చిత్రను డీసీపీ పరామర్శించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నిందితుడు వాటర్‌ బాటిల్‌లో యాసిడ్ తీసుకురావడంతో అనుమానం కలగలేదన్నారు. దంపతుల మధ్య వివాదం కారణంగానే ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ ఘటన తరువాత కోర్టు కాంప్లెక్స్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Exit mobile version