Site icon NTV Telugu

Maharashtra: ఫిర్యాదు చేసేందుకు వచ్చి అధికారి సీటులో కూర్చున్నాడు.. కటకటాల పాలయ్యాడు..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారి కుర్చీలో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సురేష్ పాటిల్ ఫిర్యాదు చేయడానికి వచ్చి మాన్‌పాడ పోలీస్ స్టేషన్‌లో ఓ వీడియోను షూట్‌ చేశాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. అతను నటించిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్లో ఓ డైలాగ్‌ ఉన్న వీడియోను రికార్డు చేశాడు. “రాణి నహీ హై తో క్యా హువా, యే బాద్షా ఆజ్ భీ లకోన్ దిలోన్ పే రాజ్ కర్తా హై (నాకు రాణి లేకపోతేనేం.. ఈ చక్రవర్తి ఇప్పటికీ లక్షల హృదయాలను పరిపాలిస్తున్నాడు)” అనే డైలాగ్‌ వస్తుంది.

స్థానిక బిల్డర్, వ్యాపారవేత్త అయిన సురేష్ పాటిల్ తన స్నేహితులతో కలిసి తుపాకీని ఊపుతున్న మరో వీడియోని కూడా జోడించి మరీ పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏ పోలీస్టేషన్‌లో షూట్‌ చేశాడో అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వోద్యోగిగా నటించడం, ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి నేరాలకు గాను కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీడియో వైరల్ కావడంతో అదే పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు అతడిని అరెస్ట్ చేసి లాక్కెళ్లారు.సురేశ్ పాండురంగ పాటిల్ అలియాస్ చౌదరిని కోర్టులో హాజరుపరచగా, నవంబర్ 4వ తేదీ వరకు పోలీసు కస్టడీకి పంపింది.

Pistols Seized: సినిమాలను తలదన్నే పోలీసుల ఛేజింగ్ సీన్‌.. 40 తుపాకులు స్వాధీనం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్డర్‌ సురేష్‌ మాన్‌పాడ పోలీస్‌ స్టేషన్‌లో నరబలి, మూఢనమ‍్మకాలకు పేరుతో ఓ వ్యక్తి చేతిలో రూ. 19 లక్షలు పోగొట్టుకున్నానంటూ ఫిర్యాదు చేశాడు.కోర్టు ఆదేశాల తర్వాత ఆ డబ్బులు వసూలు చేసుకునేందుకు పోలీస్‌స్టేషన్‌కి వచ్చినప్పుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు సురేష్ పాటిల్‌పై వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు అతని నుంచి లైసెన్స్ పొందిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారని, ఐదు లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక కొడవలి, మెర్సిడెస్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version