Man of the Match Mohammed Shami React on Kane Williamson catch: కీలక సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసినప్పుడు తాను చాలా బాధపడ్డాను అని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. తన వంతు కోసం వేచి చూశా అని, తానే కేన్‌ను పెవిలియన్ చేర్చడంతో సంతోషించా అని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఫైనల్ చేరడం ఆనందంగా ఉందని షమీ పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో విలియమ్సన్ ఇచ్చిన సునాయ క్యాచ్‌ను షమీ నేలపాలు చేశాడు. కీలక క్యాచ్‌ను వదిలేసిన షమీని భారత్ ఫాన్స్ విలన్‌గా చూశారు. కాసేపట్లోనే కేన్ వికెట్ పడగొట్టి హీరో అయ్యాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచింది. సెమీస్‌లో ఏడు వికెట్లు తీసిన మహ్మద్ షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం షమీ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్ 2023కి ముందు నేను ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. మంచి అవకాశం మోసం ఎదురు చూశాను. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధమాయ్యా. చాలా మంది యార్కర్లు, స్లో బంతుల గురించే మాట్లాడుతుంటారు కానీ.. కొత్త బంతితోనూ వికెట్లు తీసేందుకు నేను ప్రయత్నిస్తున్నా. ఆరంభంలో వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగిపోతుంది’ అని చెప్పాడు.
Also Read: CWC 2023 India Final: భారత్ ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా!
‘కివీస్‌తో మ్యాచ్‌లో కీలకమైన కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను వదిలేశా. ఆ సమయంలో చాలా బాధపడ్డా. ఆపై బౌలింగ్‌లో నా వంతు కోసం ఎదురు చూశా. కివీస్ బ్యాటర్లు ఈజీగా షాట్లు ఆడేస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు నా బౌలింగ్ సూత్రాలకు కట్టుబడి బంతులు వేశా. పిచ్ కూడా బాగుంది. అయితే తేమ ప్రభావం వస్తుందేమోనని కంగారు పడ్డాం. ఇలాంటి సమయంలో స్లో వేసే బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చు. అందుకే నేను శైలిలోనే బంతులను సంధించా. 2015, 2019 సెమీస్‌లో ఓడిపోయాం. ఈ సారి మాత్రం అవకాశాన్ని వదల్లేదు. ఇలాంటి అవకాశం మరోసారి వస్తుందనే ఆలోచన కూడా చేయడం లేదు’ అని షమీ తెలిపాడు.