NTV Telugu Site icon

కామారెడ్డి జిల్లాలో పోలీసుల తీరుపై విమర్శలు

కామారెడ్డి జిల్లాలో భూమ్‌బాయి అనే వ్యక్తి మృతి చెందగా.. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని మహిళ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో పేకాట ఆడుతున్న నిందితులను స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు చితకబాదడంతో భూమ్‌బాయికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ భూమ్‌బాయి ప్రాణాలు విడిచాడు.

భూమ్‌బాయి చనిపోవడంపై ఆయన భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన భర్తను పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని ఆమె ఆరోపిస్తోంది. తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుతూ డీజీపీ మహేందర్‌రెడ్డి లేఖ రాసింది. తన భర్త పేకాట ఆడాడని.. అయితే అంత మాత్రానికే కొట్టి చంపేస్తారా అంటూ ఆమె పోలీసులను ప్రశ్నిస్తోంది. కర్రతో చితకబాదడం వల్లే తీవ్రగాయాలు కావడంతో తన భర్త చనిపోయాడని.. తమకు న్యాయం చేయాలని లేఖ ద్వారా డీజీపీని కోరింది. మరోవైపు శాంతాపూర్‌ గ్రామంలో పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. భూమ్‌బాయి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: భారత్‌లో కొత్తగా 12,516 కరోనా కేసులు