NTV Telugu Site icon

TDS New Rules: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుండి కొత్త TDS రూల్స్

Tds

Tds

TDS New Rules: ఏప్రిల్ 1, 2025 నుండి టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) నిబంధనల్లో పెద్ద మార్పులు అమలులోకి రానున్నాయి. యూనియన్ బడ్జెట్-2025లో ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్పులు ప్రజలకు, ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలతో ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయంపై TDS భారం తగ్గనుంది. మరి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందామా.

సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వడ్డీ ఆదాయంపై TDS పరిమితిని రెట్టింపు చేసింది. ఏప్రిల్ 1 నుండి, సీనియర్ సిటిజన్ల మొత్తం వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్షలను మించితేనే బ్యాంకులు TDSని డిడక్ట్ చేస్తాయి. అంటే, ఈ పరిమితిలోపు వడ్డీ ఆదాయం ఉంటే TDS కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ నియమం ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), రికరింగ్ డిపాజిట్లు (RDలు) ఇతర సేవింగ్స్ విధానాల నుండి వచ్చే వడ్డీకి వర్తిస్తుంది.

Read Also: Hospital Fraud: వైద్యం కోసం వెళ్తే.. వివరాలు సేకరించి లోన్ తీసుకున్న కేటుగాళ్లు

ఇక సాధారణ పౌరులకు కూడా TDS పరిమితిలో మార్పు జరిగింది. ఇప్పటివరకు రూ. 40,000గా ఉన్న వడ్డీ ఆదాయం పరిమితిని రూ. 50,000కి పెంచారు. ఒకవేళ మీ వడ్డీ ఆదాయం రూ. 50,000లోపు ఉంటే, బ్యాంకు TDSని డిడక్ట్ చేయదు. ఎఫ్‌డీ వడ్డీ ఆదాయంపై ఆధారపడే వారి పన్ను భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక లాటరీ సంబంధిత TDS నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. గతంలో ఒక సంవత్సరంలో గెలిచిన మొత్తం రూ. 10,000 మించితే TDS డిడక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు, ఒక్కో లావాదేవీ రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటేనే TDS కట్టబడుతుంది. దీనివల్ల చిన్న మొత్తాలు గెలిచిన వారికి ఊరట కలుగుతుంది.

ఇన్సూరెన్స్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇన్సూరర్లకు కూడా TDS పరిమితి పెంచడం ద్వారా ప్రయోజనం కల్పించారు. ఇన్సూరెన్స్ కమీషన్‌పై TDS లిమిట్ రూ. 15,000 నుండి రూ. 20,000కి పెరిగింది. ఈ మార్పు వారి ఆదాయంపై పన్ను భారాన్ని కొంత తగ్గిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ మరియు షేర్లలో పెట్టుబడి పెట్టే వారికి కూడా శుభవార్త. డివిడెండ్ ఆదాయంపై TDS పరిమితి రూ. 5,000 నుండి రూ. 10,000కి పెంచబడింది. దీనివల్ల ఈ పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయంపై TDS భారం తగ్గుతుంది.