భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో స్టైల్, పవర్ అండ్ ఆఫ్-రోడింగ్‌కు ప్రసిద్ధి చెందిన కారు ఏదంటే.. అందరూ ‘మహీంద్రా థార్’ అన్ని టక్కున చెప్పేస్తారు. థార్ రెండవ తరం మోడల్ దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘థార్ 3 డోర్’ 2025 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ఇప్పటికే భారతదేశం అంతటా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ థార్ 3 డోర్ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
అల్టిమేట్ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీగా పేరుగాంచిన కొత్త థార్ దాని దృఢమైన డీఎన్‌ఏను నిలుపుకుంటూ.. కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్‌లు సహా అధునాతన ఫీచర్లతో వచ్చింది. కొత్త థార్ 3-డోర్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). థార్ 2025 ఎడిషన్ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ విభాగంలో బలమైన పోటీదారుగా మారనుంది. కొత్త థార్ చాలా అప్‌డేట్‌లతో వచ్చింది. రేడియేటర్ గ్రిల్ ఇప్పుడు బాడీ కలర్‌లో కవర్ చేయబడింది. బంపర్ సిల్వర్ ట్రిమ్‌ను కలిగి ఉంది, ఇది డ్యూయల్-టోన్ లుక్‌ను కలిగి ఉంది. అల్లాయ్ వీల్స్ పథ డిజైన్‌ను కలిగి ఉండగా.. వెనుక విభాగంలో పార్కింగ్ కెమెరా, వెనుక వాషర్ సహా వైపర్ ఉన్నాయి.
సౌలభ్యం కోసం కొత్త థార్‌లో డ్రైవర్ సీటు నుంచే ఇంధన మూతను తెరిచే ఎంపికను ఇచ్చారు. థార్ ఇప్పుడు రెండు కొత్త రంగులలో (టాంగో రెడ్, బాటిల్‌షిప్ గ్రే) అందుబాటులో ఉంటుంది. ప్రీమియం సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లతో కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కంపెనీ జోడించింది. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు తాజా కనెక్టివిటీలతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. మెరుగైన సీటింగ్ సౌకర్యం, మెరుగైన లెగ్‌రూమ్, కొత్త అప్హోల్స్టరీ మరింత అనుభూతిని ఇస్తాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెరుగైన క్యాబిన్ ఇన్సులేషన్ ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచుతాయి. పవర్ విండో స్విచ్‌లు డోర్ ప్యానెల్‌లకు మార్చబడ్డాయి.
కొత్త థార్ విభిన్న ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్ కాంబినేషన్‌లతో అందుబాటులో ఉంటుంది. కంపెనీ 1.5L డీజిల్ (D117 CRDe), 2.2L mHawk డీజిల్ అండ్ 2.0L mStallion పెట్రోల్ ఇంజిన్ ఎంపికను అందించింది. గేర్‌బాక్స్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి. కొత్త థార్ ధరలు టాప్-స్పెక్ వేరియంట్ కోసం రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. టాప్ ఎండ్ రూ.16.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు కూడా ఉన్నాయి.
