బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా ఉపఖండంలోని స్పిన్ పిచ్‌లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వాతావరణంలో సిద్ధమవుతోంది. ఆసీస్ ప్రధాన బ్యాటర్ స్టీవ్ స్మిత్ అయితే టీమిండియా స్పిన్నర్ రవి అశ్విన్ మిస్టరీ స్పిన్ నుంచి కాపాడుకునేందుకు అతడి బౌలింగ్ శైలిని పోలి ఉండే మహేశ్ పితియా బౌలింగ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో ఈ అనామక క్రికెటర్ పేరు వారం రోజులుగా బాగా వినిపిస్తోంది. కేవలం రంజీ ట్రోఫీ మాత్రమే ఆడిన ఈ బరోడా క్రికెటర్ గురించి మాజీ క్రికెటర్లు కూడా మాట్లాడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పుణ్యమా అని ఈ యువ స్పిన్నర్ దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా జట్టుతో నాగ్‌పూర్ చేరిన మహేశ్ పితియా.. తన ఆరాధ్య దైవం అశ్విన్‌ను కలిశాడు. అశ్విన్‌తో జరిగిన సంభాషణను మీడియాతో పంచుకున్నాడు.
Also Read: INDvsAUS Test: తొలి టెస్టుకు అంతా సిద్ధం..నాగ్‌పూర్ పిచ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం!
“ఈ రోజు నా ఆరాధ్య దైవం ఆశీర్వాదాలు తీసుకున్నా. నేనెప్పుడూ అతనిలా బౌలింగ్ చేయాలనుకుంటాను. నెట్స్‌లోకి అతను రాగానే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను. అతను మాత్రం నన్ను హత్తుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఏ బంతులు బౌలింగ్ చేశావని అడిగాడు. కోహ్లీ కూడా నన్ను చూసి నవ్వుతూ గుడ్ లక్ చెప్పాడు. ప్రాక్టీస్ క్యాంప్‌లో తొలి రోజు స్మిత్‌ను కనీసం ఆరు సార్లు ఔట్ చేసి ఉంటా. రంజీ ట్రోఫీతోనే నా కెరీర్ ప్రారంభించా. ప్రస్తుతం నా ఫోకస్ అంతా రెడ్ బాల్ క్రికెట్‌పైనే ఉంది. బరోడా జట్టులో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఐపీఎల్ గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. నేను క్యారమ్ బాల్, దూస్రా ఏం వేయను. నా స్టాక్ బాల్ ఆఫ్ బ్రేక్, మరొకటి నేను సొంతంగా డెవలప్ చేసుకుంది. బ్యాక్ స్పిన్. దీన్ని నేను వైట్ బాల్ క్రికెట్‌లో ఉపయోగిస్తాను. ఆస్ట్రేలియాతో నెట్ బౌలర్‌గా పనిచేయడం అద్భుతంగా ఉంది. స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయడమే నా పని. ప్రత్యేకంగా బంతులేయమని స్మిత్ నన్ను అడగలేదు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియోన్ నాకు విలువైన సలహాలు ఇచ్చాడు” అని మహేశ్ తెలిపాడు.
Also Read: PM Modi: పార్లమెంట్‌లో నీలిరంగు జాకెట్ ధరించిన ప్రధాని.. ప్రత్యేకత ఏంటో తెలుసా?