కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత?, అల్లుడు హరీశ్ రావు వాటా ఎంత?, ఇతరుల వాటా ఎంత? అనేది సీబీఐ విచారణలో తేలుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అని తానే అని చెప్పుకున్న కేసీఆర్.. అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత మాటలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టంగా తేలిపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబం దొంగల ముఠా అని.. వాటాల పంపకాల తేడాతోనే గులాబీ బాస్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాట మొదలయిందన్నారు. కేసీఆర్ ఆజ్ఞ లేనిదే కుటుంబంలో చీమ కూడా కదలని పరిస్థితి అని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
‘కల్వకుంట్ల కవిత పాత్రతో కేసీఆర్ కుటుంబం కొత్త నాటకానికి తెరదేశారు. కేసీఆర్ కుటుంబం దొంగల ముఠా. వాటాల పంపకాల తేడాతోనే ఆ కుటుంబంలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. కవిత రూపంలో కేసీఆర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కవిత చిలక పలుకులు పలుకుతున్నారు. కేసీఆర్ ఆజ్ఞ లేనిదే ఆ కుటుంబంలో చీమ కూడా కదలని పరిస్థితి. కవిత చెప్పిన మాటలు నిజమైతే.. ఆరోజు హరీష్ రావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. కాళేశ్వరం అవినీతి మీద పీసీ ఘోష్ గారు పరిపూర్ణంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీశారు. సమగ్ర విచారణ జరిపి కేసీఆర్, హరీష్ రావులను దోషులుగా తేల్చారు. పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చ అనంతరం సీబీఐకి అప్ప జెప్పడం జరిగింది. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం మారిందని బీజేపీ నేతలు అనేక సార్లు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాదర్శకత్వంగా పనిచేస్తుంటే.. బీఆర్‌ఎస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాపలను వెలుగుతీస్తూ ప్రక్షాళన చేస్తుంటే బీజేపీ ఆ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుంటోంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
‘కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అని తానే అని చెప్పుకున్న కేసీఆర్.. అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే. ఎమ్మెల్సీ కవిత మాటలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తేలిపోయింది. కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత?, అల్లుడు హరీశ్ రావు వాటా ఎంత?, ఇతరుల వాటా ఎంత? అనేది సీబీఐ విచారణలో తేలుతుంది. బీఆర్‌ఎస్ మొదటి దఫా ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు తప్పు చేస్తే.. కేసీఆర్ బాధ్యతాయుతంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు. అప్పుడే కవిత ఎందుకు మాట్లాడలేదు?. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత అన్నారు, ఆ దెయ్యాలు ఎవరో ఆమె చెప్పాలి. మొన్నటి వరకు కేటీఆర్ మీద ఆరోపణలు చేసిన కవిత అస్త్రాన్ని హరీష్ రావుపై మరల్చడం వెనక ఆంతర్యం? ఏంటి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడు రండి.. కాళేశ్వరం బంతి సీబీఐ కోర్టులోకి వచ్చింది, నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. చెట్లు అమ్ముకునే శాఖ ఇస్తే వందల కోట్లు దోచుకున్న పరిస్థితి. భూముల అమ్మకాల పేరిట, అప్పనంగా ప్రభుత్వ భూములను లాక్కున్నారు. బీఆర్ఎస్ హయంలో అన్ని రకాలుగా ఖజానాను కొల్లగొట్టిన ఘనత కేసీఆర్ కుటుంబందే. కాళేశ్వరంలో నాణ్యత లోపం, ఇరిగేషన్ అధికారులు మాటలు లెక్కచేయకుండా అన్ని తానై కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నిర్ధారించిన జస్టిష్ ఘోష్ కమిటీ.. కేసీఆర్, హరీశ్ రావుతో సహా పలువురిని తప్పుపట్టింది. ఇప్పుడు సీబీఐ విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Also Read: MLC Kavitha: బిగ్ బ్రేకింగ్.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత బహిష్కరణ!
‘ఒకవేళ వేగవంతంగా విచారణ చేయకుండా సాగదీస్తే.. ఇప్పటికే పలుమార్లు అవగాహన కుదుర్చుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్ మరోసారి కూడబలుకున్నాయని నిరూపితమవుతుంది. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం హరీశ్‌రావు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుతో పాటు కేటీఆర్, కవిత, అప్పటి కొంతమంది ఎమ్మెల్యేల పాత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంది కాబట్టే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకి సంబంధించి బిల్లులను తీసుకొచ్చాం. బీజేపీ ముస్లింలను బూచీగా చూపి బీసీల నోటి కాడ ముద్ద లాగేస్తోంది. భావోద్వేగాలను రెచ్చగొట్టే బీజేపీ చివరికి బీసీ బిల్లును కూడా ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటూ బిల్లును అడ్డుకోవాలని చూస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోసం అఖిల పక్షంతో కలిసి గవర్నర్ దగ్గరకి వెళితే బీజేపీ ఎమ్మెల్యేలు మొఖం చాటేశారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.. బీసీ రిజర్వేషన్ల ఎవరు అడ్డుపడుతున్నారని. బీజేపీ నేతలకు బీసీ నాయకులు అని చెప్పుకునే అర్హత లేదు. కాంగ్రెస్ వెంటపడడానికి తహతహలాడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఎవరిని వెనకోసుకోచ్చే పని లేదు. కొన్ని సందర్భాల్లో సీబీఐపై ఆరోపణలు చేసిన మాట వాస్తవం. కానీ కాళేశ్వరం దొంగలకు శిక్ష వేసే అవకాశం వచ్చింది. బీజేపీ నేతలు చిత్త శుద్ధి చాటుకోవాలి’ అని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.
