Meenakshi Natarajan Padayatra Schedule: జులై 31 నుంచి ఆగస్టు 6వరకు పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పరిగి నియోజకవర్గం నుంచి మొదలై వర్ధన్నపేట వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా వారం పాటు ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలు, శ్రమదానం నిర్వహించనున్నారు.
జులై 31న పరిగి నియోజకవర్గంలోని రంగాపుర్‌లో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు (ఆగష్టు 1) ఉదయం శ్రమదానం కార్యక్రమం ఉంటుంది. ఆగష్టు 2న అందోల్ (ఉమ్మడి మెదక్), 3న ఆర్మూర్ (నిజామాబాద్), 4న ఖానాపూర్ (ఆదిలాబాద్), 5న చొప్పదండి (కరీంనగర్), 6న వర్ధన్నపేట (వరంగల్) నియోజకవర్గాల్లో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేతలు వివరించనున్నారు.
‘పది ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలతో సమావేశం జరిగింది. నామినేటెడ్ పోస్టుల కోసం సుదీర్ఘ చర్చ జరిగింది. కార్పొరేషన్ల పోస్టులు, డైరెక్టర్ల కోసం సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బీసీల పట్ల కవిత పది ఏండ్లు అధికారంలో ఉండి ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు బీసీల గురించి వల్కబోసినా కవితను ఎవరు నమ్మరు. మేము అధికారంలోకి వచ్చాక రెండు చట్టాలు తీసుకొచ్చాం. గంగుల కమలాకర్ పది ఏండ్లు మంత్రిగా ఉండి బీసీల రిజర్వేషన్ను తగ్గిస్తే ఎందుకు మాట్లాడలేదు. ముఖేష్ గౌడ్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు. ముఖేష్ గౌడ్, శివ శంకర్ విగ్రహం పెట్టాలని అడుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి విగ్రహాలు పెడతాం’ అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
