Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్ (VFX) వర్క్ చేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ తన వెబ్‌సైట్‌లో ఈ సినిమా స్టోరీని క్లుప్తంగా రాయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని స్పష్టమైంది.
కథ ఏమిటంటే..
లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేశ్‌బాబు ఒక పరమ శివభక్తుడిగా కనిపిస్తారని సమాచారం. ప్రపంచాన్ని శాసించగల అపారమైన శక్తి కలిగిన, ప్రస్తుతం కనుమరుగైపోయిన ఒక ‘విశ్వ కళాఖండం’ కోసం మహేశ్‌బాబు కాలంతో ప్రయాణం చేస్తారు. ఈ అన్వేషణలో శతాబ్దాల నాటి ప్రాచీన రహస్యాలను ఛేదిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో, దీని వెనుక ఉన్న అసలు కుట్రదారుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అని తెలుసుకుంటాడు. ఆ విశ్వ కళాఖండాన్ని దక్కించుకుని లోకాన్ని శాశ్వతంగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న విలన్‌ను, ఆ శివభక్తుడు ఎలా అడ్డుకున్నాడు? కాల గమనాన్ని అధిగమించి విశ్వాన్ని ఎలా కాపాడాడు? అన్నదే ఈ సినిమా అసలు కథ అని టాక్.
ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్ర పేరు ‘కుంభ’ అని ఇప్పటికే వెల్లడించారు. ఆయన తన పార్ట్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారని సమాచారం. జక్కన్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి షూటింగ్ పూర్తి చేసి, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టోరీ లైన్ విన్నాక మహేశ్‌బాబు అభిమానులు మాత్రం సినిమా గ్లోబల్ లెవల్లో ఉండబోతోందని ఖుషీ అవుతున్నారు.
