Maharashtra: మహారాష్ట్ర జల్గావ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించాల్సిన ఊరేగింపు మార్గంపై ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. యావల్ తాలూకాలోని కింగాన్గావ్లో ఒక ప్రార్థనా స్థలం ముందు నుంచి ఊరేగింపు వెళ్లడాన్ని కొందరు మహిళలు వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు పెరిగి ఇరు వర్గాల రాళ్లదాడి జరిగినట్లు తెలుస్తోంది.
దసరా వేడుకల్లో భాగంగా కింగాన్గావ్లో ఆర్ఎస్ఎస్ ఊరేగింపుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, ఊరేగింపు వెళ్లాల్సిన మార్గంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పుణ్యక్షేత్రం ముందు నుంచి వెళ్లడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేశారు, రెండు గంటల పాటు చర్చలు జరిపినా నిరసన కొనసాగినట్లు జల్గావ్ ఎస్పీ శ్రీకాంత్ దివారే తెలిపారు.
నిరసన కొనసాగుతున్న సమయంలో రాళ్లదాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీని తర్వాత ఆర్ఎస్ఎస్ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ వెల్లడించారు. కింగాన్గావ్లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతగానే ఉందని, తగినన్ని బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

