CCTV Camera: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండడంతో మహారాష్ట్రకు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. టమాటా ధరలు పెరగడం వల్ల దొంగతనాలు చాలా వరకు పెరిగిపోయాయి. ఇక అక్కడే ఉండి కాపలా కాయడం చాలా కష్టమని భావించిన రైతన్న తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా కిలో ధర రూ.100 నుంచి 200 వరకు పలుకుతోంది. దీంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపూర్ బంజర్‌లో దొంగలు దాడి చేసి టమాటాలను ఎత్తుకెళ్లడంతో తన పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రైతు తెలిపారు.
Also Read: Nuh Violence: నుహ్ హింసలో 170 మంది అరెస్టు.. 57 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
ప్రస్తుతం 22 నుంచి 25 కిలోలు ఉన్న టమాటాల బాక్సును రూ.3వేలకు విక్రయిస్తున్నట్లు రైతు శరద్ రావ్టే చెప్పారు. అంత డిమాండ్ ఉన్న టమాటాలను కోల్పోవడం తాను భరించలేకపోయానని, అందుకే ఇప్పుడు పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. తన 5 ఎకరాల పొలంలో ఎకరంన్నరలో టమాటాలు పండించానని, టమాటాల విక్రయంతో తనకు రూ. 6-7 లక్షలు సులభంగా లభిస్తాయని రైతు శరద్ రావ్టే చెప్పారు.
“10 రోజుల క్రితం గంగాపూర్ తాలూకాలోని నా పొలంలో 20-25 కిలోల టమోటాలు దొంగిలించబడ్డాయి. ఇంకా పండని మిగిలిన పంటను రక్షించడానికి రూ.22 వేల విలువైన సీసీటీవీ కెమెరాను అమర్చాను, ”అని ఆ రైతన్న చెప్పారు. కెమెరా సౌరశక్తితో నడుస్తుందని, దాని విద్యుత్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతు తెలిపారు. తన ఫోన్‌లో ఎక్కడ ఉన్నా టమాట పొలం విజువల్స్‌ని తనిఖీ చేసుకోగలనని శరద్ రావ్టే చెప్పారు. టమాటా ధరలు పెరుగుతున్న తరుణంలో రైతులు వాటిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తు్న్నారు.