Site icon NTV Telugu

Farmers Crop Insurance : లక్షల విలువైన పంట నష్టపోతే రెండురూపాయల పరిహారం ఇచ్చిండ్రు

Farmers Crop Insurance : అన్నం పెట్టే రైతంటే అందరికీ చులకనే.. రైతు పదివేళ్లు భూమిలోకి వెళ్తేనే మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయన్న నిజాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆరుగాలం కష్టపడి మన కంచంలోకి అన్నం తెస్తున్న అన్నదాతను ఇటు ప్రభుత్వాలు.. అటు ప్రకృతి మోసం చేస్తూనే ఉన్నాయి. అవే కాకుండా పంట నష్టపోతే ఆదుకుంటాయనుకున్న బీమా కంపెనీలు సైతం అన్నదాతకు సున్నం పెడుతున్నాయి. మహారాష్ట్రలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ రైతు ఏడు ఎకరాల్లో పంట నష్ట పోతే అతడికి బీమా కంపెనీలు చెల్లించిన పరిహారం ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.76. పర్బణి జిల్లా దశాల గ్రామంలో ఓ రైతు రెండు ఎకరాల్లో సోయా, కంది, శనగ పంటలను సాగు చేశాడు. ఇందుకు ఆ రైతు రూ.25,000 పెట్టుబడి పెట్టాడు. ఈ సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అతడు నష్ట పరిహారం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. బీమా సంస్థ రైతుకు పరిహారంగా 1.76 రూపాయిలు చేతిలో పెట్టింది. ఇదే మాదిరి మరో రైతుకు రూ.14.21, మరో రైతుకు రూ.37.31 చొప్పున పంట నష్ట పరిహారం కింద బీమా కంపెనీలు చెల్లించడం చూస్తే అది తెలిసిన వాళ్లు అవాక్కవుతున్నారు.

Read Also: Viral News: రెండు నెలలకే పాటపాడేస్తున్న చిన్నారి.. ఆశ్చర్యంలో నెటిజన్స్

రెండు ఎకరాల పంట సాగు నిమిత్తం ఓ రైతు బీమా ప్రీమియం రూపంలో రూ.455 చెల్లించాడు. మరో రూ.200ను పంట నష్టం మదింపు చార్జీల కింద చెల్లించాడు. మొత్తం రూ.655 కట్టిన రైతు, రూ.27వేల వరకు పరిహారం వస్తుందని ఆశించాడు.. కానీ వచ్చిన రెండురూపాయలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇక మూడు ఎకరాల్లో మరో రైతు నాలుగు రకాల పంటలను వేయగా, వర్షాల వల్ల కలిగిన నష్టానికి పీఎం ఫసల్ బీమా యోజన కింద పరిహారం కోరాడు. ఒక పంట నష్టానికి రూ.14.21 వచ్చింది. మరో పంట నష్టానికి రూ.1,200 దక్కింది. మిగిలిన రెండు పంటల నష్టాలకు రూపాయి కూడా రాలేదు. కానీ, రైతు చెల్లించిన మొత్తం ప్రీమియం రూ.1,800. దీంతో పంట బీమా పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version