NTV Telugu Site icon

Maharashtra: ‘మహా’ గుడ్‌న్యూస్.. పెట్రోల్ లీటర్‌కు రూ.5, డీజిల్‌ రూ.3 తగ్గింపు

Petrol And Diesel Rates In

Petrol And Diesel Rates In

మహారాష్ట్రలో కొలువైన కొత్త ప్రభుత్వం గురువారం ఇంధన ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపారు. పెట్రోల్ ధరలను లీటరుకు రూ.5, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 తగ్గిస్తూ ఏక్‌నాథ్ షిండే సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు అధికారులు హాజరైన కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ ప్రకటన చేశారు.

త్వరలో వ్యాట్‌ని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గతంలోనే చెప్పారు.‘రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించే నిర్ణయం త్వరలో తీసుకోబడుతుంది’ అని షిండే జూలై 4న ట్వీట్ చేశారు. ఇంధన ధరలను తగ్గించడంతో పాటు రాష్ట్రంలో “స్వచ్ఛ మహారాష్ట్ర అభియాన్ 2.0 అభియాన్” అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.6000 కోట్లు భారం పడుతుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వివరించారు. “పెట్రోల్​ ధరల తగ్గింపు.. ప్రజా సంక్షేమం పట్ల భాజపా-శివసేన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం” అని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గురువారం ఉదయం ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.33, డీజిల్ ధర రూ.97.26గా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.5, డీజిల్ ధర రూ.3 మేర తగ్గనుంది.

Monkeypox: ఇండియాలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. ఎక్కడంటే..

“కేంద్ర ప్రాయోజిత అమృత్ అభియాన్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) రాష్ట్రంలో అమలు చేయబడుతుంది” అని మహారాష్ట్ర డీజీఐపీఆర్ ట్వీట్ చేసింది. ఇంధన ధరల తగ్గింపు నిర్ణయాన్ని పెద్ద ఉపశమనంగా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందని ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. గతంలో కేరళ, రాజస్థాన్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లు సామాన్యుల ప్రయోజనాల కోసం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించగా.. ఇప్పుడు ఆ జాబితాలో మహారాష్ట్ర కూడా చేరింది.