Mahadev Betting App: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహాదేవ్ ఆన్లైన్ బుక్’ అక్రమ బెట్టింగ్ సిండికేట్ సహ-యజమాని, ప్రధాన సూత్రధారి సౌరభ్ చంద్రకర్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వలలో చిక్కాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 19 కింద ఈ నెల 13న అతడిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో అరెస్ట్ చేసిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 19వ తేదీ వరకు (ఏడు రోజులు) ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు పారిపోయిన ఈ సిండికేట్ ప్రమోటర్లలో భారత్‌కు రప్పించిన మొదటి వ్యక్తి ఇతడే కావడం గమనార్హం.
నెలకు రూ. 450 కోట్ల అక్రమ సంపాదన..
సౌరభ్ చంద్రకర్, మరో సహ-ప్రమోటర్ రవి ఉప్పల్ కలిసి దుబాయ్ కేంద్రంగా ‘మహాదేవ్ ఆన్లైన్ బుక్’ పేరుతో పలు బెట్టింగ్ వెబ్సైట్లను నడిపారు. భారత్, యూఏఈలలో ‘బెట్టింగ్ ప్యానెల్స్’ ఫ్రాంచైజీల ద్వారా ఈ దందా సాగించారు. ఆటగాళ్ల నుంచి వసూలు చేసిన సొమ్మును బినామీ బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి, హవాలా మార్గంలో విదేశాలకు తరలించారు. ఈ సిండికేట్ నెలకు సుమారు రూ. 450 కోట్లు ఆర్జించినట్లు ఈడీ తన ప్రధాన అభియోగపత్రంలో పేర్కొంది.
పౌరసత్వం నాటకం.. మస్కట్‌లో పట్టివేత
2023 సెప్టెంబర్‌లో ఈడీ జారీ చేసిన సమన్లకు స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్న సౌరభ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్, ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ అయ్యాయి. భారత పాస్‌పోర్ట్ కలిగి ఉండగానే ‘వనాటు’ దేశ పాస్‌పోర్ట్ పొందిన అతడు, 2022 జూన్‌లోనే భారత పౌరసత్వాన్ని వదులుకున్నానని కోర్టులో వాదించాడు. అయితే, భారత్-ఒమన్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద ఈడీ చేసిన విజ్ఞప్తి మేరకు మస్కట్ అప్పీల్ కోర్టు అతడి అప్పగింతకు ఆదేశాలిచ్చింది. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన ధ్రువీకరణతో అతడి పౌరసత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. నకిలీ ప్రయాణ పత్రాలతో మస్కట్ విమానాశ్రయం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒమన్ అధికారుల సహకారంతో సీబీఐ బృందం నవంబర్ 1న అతడిని భారత్‌కు తీసుకొచ్చింది.
రూ. 200 కోట్ల నగదుతో విలాసవంతమైన వివాహం
2023 ఫిబ్రవరిలో యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో సౌరభ్ చంద్రకర్ వివాహం అత్యంత విలాసవంతంగా జరిగింది. ఇందుకోసం నాగ్‌పూర్ నుంచి మూడు చార్టర్డ్ విమానాలను బుక్ చేయగా, పెళ్లి ఖర్చుల కోసం ఏకంగా రూ. 200 కోట్ల నగదును వెచ్చించారు. ఈవెంట్ కంపెనీలు, హోటళ్లు, అంగడియా సంస్థల ద్వారా ఈ నగదు ప్రవాహాన్ని గుర్తించిన ఈడీ.. పెళ్లి అతిథుల జాబితా ఆధారంగా సిండికేట్ కీలక వ్యక్తుల గుట్టురట్టు చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 190 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ. 2,000 కోట్ల సొత్తును సీజ్/ఫ్రీజ్ చేసింది. దుబాయ్‌లోని 22 స్థిరాస్తులతో సహా విదేశాల్లో ఉన్న రూ. 1,800 కోట్ల ఆస్తులతో కలిపి మొత్తం రూ. 3,500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. బెట్టింగ్ సొమ్మును షేర్ మార్కెట్, విదేశీ సంస్థల్లోకి మళ్లించిన తీరును ఛేదించిన ఈడీ.. అమెరికాకు చెందిన ‘ఎబిక్స్ ఇంక్’ (Ebix Inc) కొనుగోలుకు రూ. 766 కోట్ల బెట్టింగ్ సొమ్ము వాడినట్లు గుర్తించి, ఆ విభాగంలో రూ. 941 కోట్లు అటాచ్ చేసింది. ఇప్పటివరకు 116 మంది నిందితులపై ఆరు చార్జ్షీట్లు దాఖలు కాగా, సౌరభ్ చంద్రకర్ ఈ కేసులో 15వ అరెస్ట్. కస్టడీలో భాగంగా సహచరుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలతో అతడిని విచారించనున్నారు.

